జూన్‌ 2లోపు ఇందిరమ్మ ఇళ్ల పూర్తి లక్ష్యం..

జూన్‌ 2లోపు ఇందిరమ్మ ఇళ్ల పూర్తి లక్ష్యం..

ఖమ్మం కార్పొరేషన్‌లో కమిషనర్ సమీక్ష సమావేశం
వార్డ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
పెన్షన్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం
అన్‌అసెస్‌మెంట్ ఆస్తుల గుర్తింపుపై దృష్టి
ప్రాపర్టీ టాక్స్‌తో కార్పొరేషన్ ఆదాయం పెంపు
పరిశుభ్ర ఖమ్మం కోసం నిధుల సమీకరణకు ప్రాధాన్యం
కమిషనర్ అభిషేక్ అగస్య….

ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ అభిషేక్ అగస్య కమిషనర్‌ అధికారులు,రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వార్డ్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై విస్తృతంగా చర్చించారు. జూన్‌ 2లోపు ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని వార్డ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

పెన్షన్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం

పెన్షన్ దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ అభిషేక్ అగస్య ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన ప్రయోజనాలు అందేలా పారదర్శకంగా పరిశీలనలు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి దరఖాస్తును బాధ్యతాయుతంగా పరిశీలించాలని తెలిపారు.

ప్రాపర్టీ టాక్స్ అసెస్‌మెంట్‌పై దృష్టి..

నగర పరిధిలో అన్‌అసెస్‌మెంట్ ఆస్తులను గుర్తించి వెంటనే ప్రాపర్టీ టాక్స్ అసెస్‌మెంట్ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఇలా చేయడం ద్వారా కార్పొరేషన్ ఆదాయం పెరుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు. పెరిగిన ఆదాయంతో శానిటేషన్ సేవలు, శానిటేషన్ వాహనాల విస్తరణతో పాటు నగరాభివృద్ధి పనులను మరింత సమర్థంగా చేపట్టవచ్చని వివరించారు.

పరిశుభ్ర ఖమ్మం లక్ష్యంగా చర్యలు

ఖమ్మం నగరాన్ని మరింత పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధుల సమీకరణలో ప్రాపర్టీ టాక్స్ కీలక పాత్ర పోషిస్తుందని కమిషనర్ తెలిపారు. ప్రతి వార్డ్ ఆఫీసర్ రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని విధులను క్రమబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించారు. ప్రజాసేవలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ నగరాభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశం లో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, రెవెన్యూ ఆఫీసర్ సుధాకర్‌, వార్డ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply