500-Cusecs : ఊరూర గోదారి సవ్వడి Andhra Prabha Top News

500-Cusecs : ఊరూర గోదారి సవ్వడి Andhra Prabha Top News
- డెల్టాకు సాగునీరు విడుదల
- ఏరువాకకు రైతన్న సన్నద్ధం
( ఆంధ్రప్రభ, రాజమహేంద్రవరం )

500-Cusecs : ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ లో ఆదివారం పండుగ వాతావరణం నెలకొంది. ఖరీఫ్ సీజన్ కు సాగునీటిని విడుదల చేయటంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితర ప్రజాప్రతినిధులు గోదావరి జలాలను కాలువలకు విడుదల చేశారు.
500-Cusecs : రైతు సంక్షేమమే లక్ష్యం

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు డెల్టా కాలువ ద్వారా సుమారు 85 వేల ఎకరాలకు, నిడదవోలు, కొవ్వూరు కాలువల ద్వారా మరో 41 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నదని చెప్పారు.
500-Cusecs : ఎల్ నినో కారణంగా..

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు నాట్లు ముందుగానే వేసుకొని పంటలను రక్షించుకోవాలని సూచించారు. ముందస్తు నీటి విడుదల వల్ల పంట త్వరగా చేతికొచ్చి రైతులు నష్టాల నుంచి బయటపడతారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం గోదావరి డెల్టాను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ గేట్ల మరమ్మతులకు నిధులు కేటాయించలేదని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బ్యారేజ్ గేట్ల మరమ్మతుల కోసం రూ.148 కోట్లు మంజూరు చేసి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. కాలువల మరమ్మతుల కోసం మరో రూ.13 కోట్లు విడుదల చేసి, సాగునీటి సంఘాల ద్వారా 80 శాతం పనులు చేపట్టినట్లు వెల్లడించారు.

రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి, 24 గంటల్లోనే వారి ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు నెలల తరబడి చెల్లింపుల కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని, ప్రస్తుతం రైతు కేంద్రిత పాలన సాగుతోందన్నారు.
రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ మాట్లాడుతూ రైతు బాగుంటే గ్రామం, రాష్ట్రం, దేశం బాగుంటుందనే సిద్ధాంతంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు ముందస్తుగా సాగునీరు అందించడం ప్రభుత్వం రైతుల పట్ల కలిగిన నిబద్ధతకు నిదర్శనమన్నారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యారేజ్ మరమ్మతులు, కాలువల పునరుద్ధరణ పనులు సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ నీటి విడుదల ద్వారా కాకినాడ జిల్లా పరిధిలో 1,37,838 ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి రానుందని తెలిపారు.

అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్‌లో 117 గేట్లను కొత్తవిగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసిందన్నారు. ప్రకృతి వైపరీత్యాల ప్రభావం తగ్గించి రైతులకు మేలు చేకూర్చే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి విడుదలకు వార్షిక ప్రణాళిక రూపొందించిన ముఖ్యమంత్రి నిర్ణయాల ఫలితంగానే నేడు ధవళేశ్వరం నుంచి నీటి విడుదల జరుగు తోందన్నారు. 1847లో గోదావరి ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సర్ ఆర్థర్ కాటన్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గోదావరి జలాల పరిరక్షణ కోసం పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో రూ.100 కోట్ల నిధుల కేటాయింపుకు హామీ లభించిందన్నారు. గోదావరి కాలుష్య నివారణ, బ్యారేజ్ పరిరక్షణ, సాగునీటి సదుపాయాల మెరుగుదలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ మూరలశెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఈస్టర్న్ డెల్టాకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందని, రైతుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సాగునీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు పాల్గొనడం పట్ల ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
వెస్ట్రన్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురళీకృష్ణరాజు మాట్లాడుతూ, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే సాగునీటిని విడుదల చేయడం అభినందనీయమన్నారు. గోదావరి డెల్టా పరిధిలోని రైతులు నీటిని పొదుపుగా వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని కోరారు. సాగునీటి వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చేపడుతున్న బ్యారేజ్, కాలువల మరమ్మతు పనులు రైతాంగానికి దీర్ఘకాలికంగా మేలు చేస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ మూరల శెట్టి సునీల్ కుమార్, వెస్ట్రన్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ మురళీ కృష్ణ రాజు, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు చీఫ్ ఇంజనీర్ చినబాబు, ధవళేశ్వరం ఎస్ ఈ జి. శ్రీనివాస్ రావు, హెడ్ వర్క్స్ ఎస్ ఈ శ్రీనివాస్, ఈ ఈ రామ కృష్ణ, విజ్హేశ్వరం ఈ ఈ రమేష్ బాబు, రైతులు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం విజ్జేశ్వరం గ్రామంలో నిర్వహించిన ఖరీఫ్ సాగునీటి విడుదల కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులకు సకాలంలో సాగునీరు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.
ALSO READ : May-31-Success-Story : ఫ్యాక్షన్ పీడ వీడి ..Andhra Prabha Top Story
