మంత్రాలయం తుంగభద్రలో విషాదం..

మంత్రాలయం తుంగభద్రలో విషాదం..
ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతు
మంత్రాలయం, ఆంధ్రప్రభ : మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. సత్యనారాయణ స్వామి వ్రతానికి హాజరైన బంధువులు పూజ అనంతరం సమీప నదికి ఈతకు వెళ్లగా ఐదుగురు గల్లంతయ్యారు. నీటి లోతు అంచనా వేయలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
సమాచారం మేరకు హైదరాబాద్‌కు చెందిన యువన్ చంద్ర (5), సతీశ్ (35), మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర (25), ధను (23), ఉరవకొండకు చెందిన సంధ్య (22) నదిలోకి దిగగా ఒక్కసారిగా నీటి ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యారు. వారితో పాటు ఉన్న ఆదోనికి చెందిన అపర్ణ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు, మత్స్యకారుల సహకారంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం విస్తృతంగా వెతుకుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో శుభకార్యానికి హాజరైన కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
