రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలి..

రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలి..

తిరుపతి ఆంధ్రప్రభ: జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ హెచ్చరించారు.

తిరుపతిలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో జనసేనలో పనిచేసిన దాసరి రాము ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

2019 ఎన్నికల తర్వాత పార్టీని వీడి వెళ్లిన వారిలో దాసరి రాము కూడా ఉన్నారని పేర్కొన్నారు. నాదెండ్ల మనోహర్‌ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసేందుకు ప్రత్యేక బృందం పనిచేస్తోందని, ఆయనను ఒక కులానికి పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోందని కిరణ్ రాయల్ అన్నారు.

సుగాలి ప్రీతి ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని జనసేన పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించామని, ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని తెలిపారు.

తెలంగాణలో ప్రజలు విపత్తులు, ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం అందించారని గుర్తు చేశారు.

పార్టీ నాయకత్వంపై వ్యక్తిగత విమర్శలు, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని సూచించారు.

వైసీపీ సోషల్ మీడియా వేదికల ద్వారా కొందరు జనసేనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన కిరణ్ రాయల్, పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయ విభేదాలు ఉన్నా వ్యక్తిగత దూషణలకు తావివ్వకూడదని అన్నారు.

Leave a Reply