చెరువుల అభివృద్ధితో భూగర్భ జలాల పెంపు
చెరువుల అభివృద్ధితో భూగర్భ జలాల పెంపు
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: జిల్లాలో నీటి వనరుల సంరక్షణ, సుస్థిర జలవ్యవస్థ నిర్మాణం, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ సమతౌల్యం లక్ష్యంగా చేపడుతున్న జలధార–జలహారతి కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు జోడిచింతల చెరువులో శుక్రవారం జరుగుతున్న జలధార–జలహారతి పనులను కలెక్టర్ లక్ష్మీశ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా పలుగు పట్టి చెరువు పనిలో భాగస్వామ్యమై ఉపాధి హామీ శ్రామికులను ప్రోత్సహించారు.
శ్రామికులతో కలిసి భోజనం చేసి వారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతి, నాణ్యత, శ్రామికులకు అందుతున్న వేతనాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సీఎం, డిప్యూటీ సీఎం దిశానిర్దేశానికి అనుగుణంగా జిల్లాలో జలధార కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 445 చెరువుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి, దశలవారీగా పనులు చేపడుతున్నామని చెప్పారు.
ఈ చెరువుల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10.4 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.5 టీఎంసీల మేరకే నిల్వ సామర్థ్యం ఉందని తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చెరువులను పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన చెరువులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.చెరువుల పూడిక తొలగింపు, నీటి నిల్వ సామర్థ్య పెంపు, ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణ, గట్ల నిర్మాణం, చెరువు కట్టల బలోపేతం వంటి పనులను విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో జలధార కార్యక్రమం కింద ఉపాధి హామీ పథకం అనుసంధానంతో రూ.87 కోట్ల వ్యయంతో 1,300 పనులను గుర్తించినట్లు చెప్పారు. ఈ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఫీడర్ ఛానళ్లు, ఎగ్జిట్ కెనాళ్ల అభివృద్ధి, అనుసంధానానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఆర్థిక వృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు
చెరువుల పునరుద్ధరణ ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాల మట్టం పెరగడంలో మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. దీని వల్ల వ్యవసాయానికి నీటి అందుబాటు మెరుగుపడటంతో పాటు తాగునీటి సమస్యలు కూడా తగ్గుతాయని చెప్పారు. జలధార కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మండల, గ్రామ స్థాయిలో ఏర్పాటైన కమిటీలు చెరువుల పరిరక్షణ, పనుల పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాయని పేర్కొన్నారు.
అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపల పెంపకం, పశుసంవర్ధక రంగం, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు కూడా ఈ కార్యక్రమం మేలు చేస్తుందని తెలిపారు. డ్వామా, ఇరిగేషన్, అటవీ, భూగర్భ జలవనరుల శాఖల అధికారుల సమన్వయంతో టీమ్ ఎన్టీఆర్ జలధార–జలహారతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోందని కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ ఎ. రాము, డీఎఫ్వో జి. సతీష్, ఎంపీడీవో డి. శకుంతల, ఏపీవో ప్రమీల పాల్గొన్నారు.
