ఏ కార్యకర్తకు కష్టం రానివ్వను: ఎమ్మెల్యే పరిటాల సునీత

ఏ కార్యకర్తకు కష్టం రానివ్వను: ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు, ఆంధ్రప్రభ మహానాడు వేదికగా మాటిస్తున్నాను… మమ్మల్ని నమ్ముకున్న ఏ కార్యకర్తకు కష్టం రానివ్వమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా రెండో రోజు మహానాడు కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిశాయని ఆమె తెలిపారు.
రాష్ట్ర స్థాయిలో రాప్తాడు నియోజకవర్గం 5వ స్థానంలో, 7వ స్థానంలో 10వ క్లస్టర్ రామగిరి నిలిచాయని పేర్కొన్నారు. 12 క్లస్టర్ల పరిధిలో వేలాది మంది హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ముందుగా అన్ని క్లస్టర్లలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా, ఎమ్మెల్యే పరిటాల సునీత కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. “జోహార్ ఎన్టీఆర్” నినాదాలతో ప్రాంతమంతా మార్మోగిందని తెలిపారు.
నియోజకవర్గ పరిశీలకురాలు పద్మలతా రెడ్డితో కలిసి పిఆర్ కన్వెన్షన్ సెంటర్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నాయకులతో కలిసి భోజనం చేసి, వారితో ఫోటోలు దిగినట్లు పేర్కొన్నారు. రామగిరి 10వ క్లస్టర్, రాప్తాడు మండలం బండమీదపల్లి 7వ క్లస్టర్, రాప్తాడు టీడీపీ కార్యాలయం 6వ క్లస్టర్, అనంతపురం రూరల్ పరిధిలోని వీరనాగమ్మ దేవస్థానం కల్యాణ మండపంలో 5వ క్లస్టర్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తొలిసారి తమ ప్రాంతంలో, తమ మనుషుల మధ్య మహానాడు నిర్వహించుకునే అవకాశం రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన వెంట నిలిచిన కార్యకర్తల మద్దతును మరచిపోలేనని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు, వైస్ చైర్మన్ గంగులకుంట కృష్ణ, సొసైటీ చైర్మన్ గోపాలనాయుడు, యూత్ అధ్యక్షుడు బొమ్మేపర్తి రాజశేఖర్ రెడ్డి, హి.పా కార్యదర్శి వెంకట రాముడు, అధికార ప్రతినిధి పాలచెర్ల ముత్యాలప్ప, క్లస్టర్ ఇన్చార్జిలు, మాజీ సర్పంచులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
