తెలంగాణ ప్రజలకు బక్కని క్షమాపణలు చెప్పాలి

తెలంగాణ ప్రజలకు బక్కని క్షమాపణలు చెప్పాలి
-బక్కని నరసింహులుపై తెలంగాణ యువజన సంఘం ఆగ్రహం
సూర్యాపేట, ఆంధ్రప్రభ:
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఆంధ్రప్రదేశ్ మహానాడులో వ్యాఖ్యలు చేసిన టీటీడీపీ మాజీ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు, తెలంగాణ టీడీపీ ఇంచార్జి బక్కని నరసింహులు వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక తల్లి విగ్రహం వద్ద బక్కని నరసింహులు దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా అనంతుల మధు మాట్లాడుతూ, బక్కని నరసింహులు వెంటనే క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. “తెలంగాణ అనేది డిక్షనరీలో ఒక పదం మాత్రమే కాదు, నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవం” అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రపై అవగాహన లేకుండా బాధ్యతారహితంగా మాట్లాడొద్దని సూచించారు. తెల్లపూర్ శాసనంలో కూడా తెలంగాణ ప్రస్తావన ఉందని గుర్తు చేస్తూ, రాష్ట్ర అస్తిత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలను సహించేది లేదని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భాషిపంగు సునీల్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు సంతోష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుగులోత్ సురేష్ నాయక్, జిల్లా నాయకులు దారవత్ వెంకటేష్ నాయక్, జక్కలి గోపి, చింతకాయల మహేష్, లావుడ్యా బాలాజీ నాయక్, పోలోజు మహేష్ చారి తదితరులు పాల్గొన్నారు.

