అప్రమత్తంగా భద్రతా వలయం

అప్రమత్తంగా భద్రతా వలయం
మహబూబాబాద్‌లో విస్తృత తనిఖీలు
మహబూబాబాద్, ఆంధ్రప్రభ:
పవిత్ర బక్రీద్ పండుగను పురస్కరించుకుని మహబూబాబాద్ పట్టణంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు, పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు నిఘాను పెంచారు.
టౌన్ సీఐలు ఎల్. రఘుపతి రెడ్డి, జి. ఉమా ఆధ్వర్యంలో బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు గురువారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. భక్తులతో రద్దీగా ఉండే ఈద్గాలు, దర్గాలు, ప్రధాన కూడళ్లతో పాటు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, నెహ్రూ సెంటర్, తొర్రూరు బస్ స్టాండ్ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వదిలేసి వెళ్ళిన బ్యాగులు, ఇతర వస్తువులను డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, భక్తులు ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ తనిఖీల్లో అంజయ్య, అశోక్, మురళి, ఆర్పీఎఫ్ సిబ్బంది ఆర్. సార్య, కె. నాగిరెడ్డి, డాగ్ హ్యాండ్లర్ ఎల్. సునీల్ మరియు వారి బృందం పాల్గొన్నారు.
