ఆ మహానేత జయంతి సభలో అధికారుల నివాళి…
ఆ మహానేత జయంతి సభలో అధికారుల నివాళి…
మాటల్లో ఆత్మగౌరవ సందేశం
నరసరావుపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు, జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఆదేశాల అనుసరణలో పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధికారి నారదముని ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ హాల్లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా డీఆర్వో నారదముని మాట్లాడుతూ, తెలుగు ప్రజలు అభిమానంతో “అన్నగారు” అని పిలిచే ఎన్టీఆర్ 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారని తెలిపారు. చిన్ననాటి నుంచే నాటకాలపై ఆసక్తి పెంచుకుని, అనంతరం సినీ రంగంలో ప్రవేశించి విశిష్టమైన గుర్తింపు సాధించారని పేర్కొన్నారు.
రాముడు, కృష్ణుడు, భీముడు, అర్జునుడు, భీష్ముడు, రావణుడు వంటి పౌరాణిక పాత్రలను అద్భుతంగా పోషించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.
రాజకీయ రంగంలో పేద ప్రజల సంక్షేమం కోసం కిలో రెండు రూపాయల బియ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. జనతా వస్త్రాలు, పక్కా గృహాల నిర్మాణం వంటి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని పేర్కొన్నారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేతగా ఎన్టీఆర్ చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ, డీఎస్ఓ ఎం.వి. ప్రసాద్, యానిమల్ హజ్బెండరీ అధికారి బి. శ్రీనివాసరావు, సెరికల్చర్ ఆఫీసర్ బాల సుబ్రహ్మణ్యం, జిల్లా రవాణా అధికారి సంజీవ్ కుమార్, మాచర్ల తహశీల్దార్ కిరణ్ కుమార్, డీటీలు లక్ష్మీ ప్రసాద్, రామకోటేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ గంగినేని బ్రహ్మేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
