పార్టీలకు ఎజెండాగా మారిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు

పార్టీలకు ఎజెండాగా మారిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు

  • టిఆర్ఎస్ త్వరలో పాదయాత్ర..
  • ప్రాజెక్టుల పరిశీలనకు ముఖ్యమంత్రి స్వయంగా పర్యటన..
  • చిత్తశుద్ధి గా అధికార పార్టీ పూర్తి చేస్తుందా??
  • పూర్తి అయ్యేవరకు బిఆర్ఎస్ పార్టీ పోరాటం ఉంటుందా..?
  • రూ. 80 వేల కోట్లతో అంచనాలతో ప్రారంభం

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల సాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రస్తుతం రాజకీయ పార్టీలకు ప్రధాన అజెండాగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ ప్రాజెక్టు అంశంపై రాజకీయ పోరు ముదురుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, పర్యటనలు, పాదయాత్రల ప్రకటనలతో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది.

ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా పూర్తి చేయలేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో రిజర్వాయర్లను సందర్శిస్తూ పాదయాత్ర నిర్వహిస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. దీనికి ప్రతిస్పందనగా కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోనే ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టు 90 శాతం పూర్తైందని చెప్పడం పచ్చి అబద్ధమని విమర్శించారు. రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో, 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ హయాంలో రూ.35 వేల కోట్లు మంజూరు చేసినప్పటికీ, సుమారు రూ.27 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు. ఖర్చు చేసిన నిధుల ఆధారంగా చూస్తే 25 నుంచి 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని ఆయన అన్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఏదుల, నార్లాపూర్, ఉద్దండపూర్, కరివేన, వట్టెం రిజర్వాయర్ల పనులు ఇంకా పూర్తికాలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పోరాట బాట పట్టింది. మాజీ మంత్రులు టి. హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాదయాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. పాదయాత్ర ముగింపులో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ ప్రకటనల నేపథ్యంలో అధికార పార్టీలోనూ కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు ప్రాజెక్టు పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. భూసేకరణ, నిధుల కేటాయింపు, నిర్మాణ పనుల వేగవంతంపై చర్యలు తీసుకుంటున్నారు.

ఇటీవల ఏదుల, నార్లాపూర్, వట్టెం రిజర్వాయర్లను మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులు సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

అదే సమయంలో పాలమూరు ప్రాంత అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం ఇటీవల జేఏసీ కూడా ఏర్పడి మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పించింది. లక్ష్మీపల్లి రిజర్వాయర్ అంశంపై బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన కార్యక్రమం నిర్వహించినట్లు సమాచారం. మొత్తంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించగలిగితే అది అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా లాభదాయకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.