ఉరవకొండకు భారీ నిధుల మంజూరు..

ఉరవకొండకు భారీ నిధుల మంజూరు..
పెండింగ్ భవనాల నిర్మాణానికి ఊపిరి
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిర్విరామ కృషి ఫలితంగా ఉరవకొండ నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు వరుసగా మంజూరవుతున్నాయి.
గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 40 సచివాలయ భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి వారం కిందట రూ.9.61 కోట్లు విడుదల కాగా, రెండు రోజుల కిందట 32 రైతు సేవా కేంద్రాల నిర్మాణానికి రూ.6.33 కోట్లు మంజూరు చేశారు.
తాజాగా ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో నిలిచిపోయిన 57 అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణం కోసం రూ.5.39 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఆర్టీ నెం.87 విడుదలైంది.
ఈ మేరకు ప్రభుత్వ సెక్రటరీ ఏ. సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పెండింగ్‌లో ఉన్న సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.
మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, తాను ఎక్కడ ఉన్నా ఉరవకొండ అభివృద్ధే తన తొలి ప్రాధాన్యమని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
