కోయలగూడెం బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం..

కోయలగూడెం బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం..
- ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన కారు..
- డ్రైవర్ అక్కడికక్కడే మృతి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి 65పై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై నిలిచి ఉన్న డీసీఎం వాహనాన్ని ఎర్టిగా కారు వెనుక నుండి బలంగా ఢీకొట్టిన ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం సంభవించింది.
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం బధ్య తండాకు చెందిన బానోతు మల్లేష్ తన ఎర్టిగా కారు (TG 26T 1119) లో కిరాయి ప్రయాణికులను ఎక్కించుకుని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో డ్రాప్ చేశాడు. అనంతరం తిరిగి సూర్యాపేట వైపు ప్రయాణమయ్యాడు. చౌటుప్పల్ పరిధిలోని కోయలగూడెం బ్రిడ్జి సమీపంలోకి రాగానే, రహదారిపై రిపేరు వచ్చి ఆగి ఉన్న ఒక డీసీఎం (AP 24 TG 1529) వాహనాన్ని మల్లేష్ నడుపుతున్న కారు వేగంగా ఢీకొట్టింది.
రోడ్డుపై రిపేరుకు గురైన డీసీఎం వాహనాన్ని దాని డ్రైవర్ మార్గమధ్యంలోనే నిలిపివేశాడు. వెనుక వచ్చే వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ఎటువంటి ఇండికేటర్లు గానీ, హెచ్చరిక సిగ్నల్స్ గానీ అక్కడ ఏర్పాటు చేయలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో వేగంగా వచ్చిన ఎర్టిగా కారుకు ఆగి ఉన్న డీసీఎం కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జవగా.. డ్రైవర్ మల్లేష్ తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్ పేర్కొన్నారు.
