స్థానిక కార్మికుల పునర్నియామకంపై ఎమ్మెల్యే చొరవ..

స్థానిక కార్మికుల పునర్నియామకంపై ఎమ్మెల్యే చొరవ..
-ఎల్‌పీసీ కంపెనీ వద్ద ఆందోళన విరమణ
హసన్‌పర్తి, ఆంధ్రప్రభ:
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లపూర్‌లోని ఎల్‌పీసీ కంపెనీలో స్థానిక కార్మికులను తొలగించడంతో కార్మికులు ఆందోళన చేపట్టారు. కంపెనీ ఎదుట బైఠాయించి నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు.
ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు నేదునూరి సునీల్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులు ఆందోళనలో పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. లోకల్ కార్మికులపై యాజమాన్య వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నేదునూరి సునీల్ మాట్లాడుతూ, 40 సంవత్సరాలుగా కంపెనీలో పనిచేస్తున్న 30 మంది స్థానిక కార్మికులను తొలగించి ఇతర రాష్ట్రం ఒరిస్సా నుంచి వచ్చిన కార్మికులను నియమించడం అన్యాయమని ప్రశ్నించారు. తొలగించిన స్థానిక కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానిక కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు కంపెనీ యాజమాన్యంతో చర్చించారు. ఎమ్మెల్యే చొరవతో యాజమాన్యం సానుకూలంగా స్పందించి, తొలగించిన స్థానిక కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది.
దీంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆందోళనను విరమించారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యేకు కార్మికులు, హసన్‌పర్తి మండల కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
