విషాదం.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి
విషాదం.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి
మోత్కూరు, ఆంధ్రప్రభ:
మండలంలోని పాలడుగు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రామానికి చెందిన ఎడ్ల శేఖర్ (30) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఎర్టిగా కారు (TS 25 G 2513) పాలడుగు గ్రామ సమీపానికి చేరుకోగా, సర్వీస్ రోడ్ నుంచి మెయిన్ రోడ్డుపైకి ఎక్కుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో శేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో ఆయన మృతి చెందాడు.
పాలడుగు గ్రామ హైవేపై సరైన హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ప్రాణనష్టం జరిగినప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మృతుడి తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సీఐ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
