మండల ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం ఎప్పుడు?

మండల ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం ఎప్పుడు?

  • తల్లిదండ్రుల ఆందోళన

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ:
మున్సిపల్ కేంద్రంలోని మండల ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు కూలిపోయినప్పటికీ, ఇప్పటివరకు పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల విద్యాశాఖ అధికారులు కూలిన ప్రహరీ గోడను పరిశీలించి, నిధులు కేటాయించి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం.

కొత్త విద్యా సంవత్సరం వచ్చే నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, ఇప్పటికీ ప్రహరీ గోడ లేకపోవడం విద్యార్థుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. మున్సిపాలిటీకి నిధులు వచ్చినప్పటికీ పాఠశాలలకు కనీస మౌలిక సదుపాయాలు అందకపోవడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారని, భద్రత లేకపోవడం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు స్పందించి పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి విద్యార్థులకు భద్రత కల్పించాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply