పూడ్చని బోరుబావులపై ఎస్‌డీఆర్ఎఫ్ ప్రత్యేక చర్యలు

పూడ్చని బోరుబావులపై ఎస్‌డీఆర్ఎఫ్ ప్రత్యేక చర్యలు

  • 50 ప్రమాదకర బావుల గుర్తింపు

నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ:
రైతులు పంటల కోసం వేసి ఉపయోగంలో లేకుండా వదిలేసిన బోరుబావుల వల్ల చిన్నారులు, పెద్దలు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో 12వ బెటాలియన్ ఎస్‌డీఆర్ఎఫ్ బోర్‌వెల్ రెస్క్యూ టీం నల్లగొండ జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టింది.

అన్నెపర్తి కమాండెంట్ కె. వీరయ్య ఆదేశాల మేరకు అడిషనల్ కమాండెంట్ ఆర్. నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమాండెంట్ ఎన్. వెంకన్న, ఆర్‌ఐ వై. రవీందర్ నేతృత్వంలో బృందాలు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి.

ఈ బృందాలు నల్లగొండ మండలం అన్నెపర్తి, అప్పాజీ పేట, బుద్ధారం, కంచనపల్లి గ్రామాలతో పాటు నార్కట్‌పల్లి మండలం యల్లారెడ్డిగూడెం ప్రాంతాల్లో రెండు రోజులుగా పరిశీలనలు నిర్వహించాయి. ఈ సందర్భంగా సుమారు 50 ప్రమాదకరంగా ఉన్న పూడ్చని బోరుబావులను గుర్తించారు.

గుర్తించిన బోరుబావులను శాస్త్రీయ పద్ధతిలో మట్టితో లేదా కాంక్రీటుతో పూడ్చివేయడంతో పాటు కొన్ని చోట్ల ఐరన్ ప్లేట్లతో భద్రంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. చిన్నారులు బోరుబావుల వద్దకు వెళ్లకుండా గ్రామస్థులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

బోరుబావుల ప్రమాదాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతులు, ప్రజలకు జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. ప్రమాదకర బోరుబావుల సమాచారం వెంటనే స్థానిక అధికారులకు లేదా ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలకు తెలియజేయాలని కోరారు.

బోరుబావుల వద్ద నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.