“80 దాటినా 20 నాటి శ్రమే..

“80 దాటినా 20 నాటి శ్రమే..

చింతచిగురు కోసం చెట్టెక్కుతున్న దమ్మపేట బామ్మ”

దమ్మపేట, ఆంధ్రప్రభ : శ్రమకు వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్న ఒక 80 ఏళ్ల వృద్ధురాలి జీవన పోరాటం దమ్మపేటలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దమ్మపేటకు చెందిన ముసుగు సుశీల అనే బామ్మ వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా చెట్టెక్కి చింతచిగురు కోసి జీవనోపాధి పొందుతోంది.

సుమారు 80 ఏళ్లు దాటిన ఆమె నడుము పూర్తిగా వంగిపోయి, నడవడానికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ, జీవనం కోసం చెట్లపైకి ఎగబాకి చింతచిగురు కోస్తూ జీవనం సాగిస్తున్నారు. నేలపై నడిచేటప్పుడు ఒక్కో అడుగు ఎంతో కష్టంగా వేస్తూ, చేతిలో సంచి పట్టుకుని ప్రయాసతో కదులుతున్న ఆమెను చూసిన వారికి జాలి కలగక మానదు.

అయితే అదే వృద్ధురాలు చెట్టెక్కిన తర్వాత చూపించే చురుకుదనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎలాంటి ఆధారం లేకుండా ఎత్తైన కొమ్మలపైకి సునాయాసంగా ఎగబాకి చింతచిగురు కోయడం చూసి దారిన పోయే వారు అవాక్కవుతున్నారు.

దమ్మపేటలో నివసిస్తున్న ఆమె, చింతచిగురు కోసి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా స్వశక్తితో బతకాలని ఆమె చూపుతున్న సంకల్పం స్థానికులను ఆకట్టుకుంటోంది.

వృద్ధాప్యంలోనూ రెక్కల కష్టంతో జీవిస్తున్న సుశీలమ్మ కష్టం, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని స్థానికులు కొనియాడుతున్నారు.