India US Deal | భారత్ – అమెరికా కీలక ఒప్పందం

India US Deal | భారత్ – అమెరికా కీలక ఒప్పందం

India US Deal | చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా భారత్ అడుగులు
తెలుగు రాష్ట్రాల్లో అపారమైన రేర్ ఎర్త్ ఖనిజ సంపద
హైటెక్, రక్షణ రంగాలకు భారీ ఊతం

India US Deal | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచ వ్యాప్తంగా అరుదైన లోహాల వినియోగం పెరుగుతోంది. ఈ లోహాల ప్రోసెసింగ్, సరఫరాల్లో చైనా గుత్తాధిపత్యం వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అవుతున్న అరుదైన లోహాల్లో 80 శాతం వరకు చైనాయే నిర్వహిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో పాటు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి ఈ లోహాల అవసరం ఎంతైనా ఉంది.

వీటి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో భారత్ తన అవసరాలకు అనుగుణంగా ఈ అరుదైన లోహాల సరఫరాపై అమెరికాతో మంగళవారం చేసుకున్న ఒప్పందం ఇరు దేశాల వాణిజ్య రంగంలో ఓ చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది. హైటెక్ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, రక్షణ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఈ అరుదైన ఖనిజాలు అవసరం.

న్యూఢిల్లీలో జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో ఖరారైన ఈ ఒప్పందంతో భారత్లో అరుదైన లోహాల వెలికితీత, శుద్ధి, రీసైక్లింగ్ ప్రక్రియల్లో అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకుంటుంది. తద్వారా ఈ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు మార్గం సుగమం అవుతుంది. అమెరికాతోనే కాదు.. అరుదైన లోహాల దిగుమతుల కోసం చైనాపై ఆధారపడకుండా రష్యాతో కూడా భారత్ ఒప్పందాలను ఖరారు చేసుకుంటోంది. రష్యాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు నార్నికెల్, రోసాటన్ సాయంతో భారత్లో మైనింగ్, ప్రోసెసింగ్‌లను చేపట్టేందుకు చర్చలు వివిధ దశల్లో ఉన్నాయి.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారత్ సొంత గడ్డపైనే అరుదైన లోహాల ఉత్పత్తి పెంచుకునేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం భారీగా నిధులను కూడా కేటాయించింది. వాస్తవానికి భారత భూగర్భంలో అరుదైన లోహ సంపద అపారంగా ఉంది. అయితే వాటిని వెలికితీసి శుద్ధి చేసే సాంకేతిక సామర్థ్యం భారత్ వద్ద ఇప్పుడు అందుబాటులో లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలోనే దాదాపు 37 లక్షల టన్నుల మోనజైట్ నిల్వలున్నాయి. శ్రీకాకుళం నుంచి విశాఖ వరకు సముద్ర తీర ఇసుకలో జిర్కోనియం ఉంది.

ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో బాస్టమిసైట్, అలానైట్ నిక్షేపాలున్నాయి. అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో లిథియం, నెల్లూరులో మైకా, అనంతపురంలో బెరీలియం, టైటానియం, ప్రకాశం జిల్లాలో నియోబియం, టాంటలం, తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల మట్టి పొరల్లో డైస్పోసియం, కాల్షియంతో పాటు గారి, గ్రాఫైట్, మాలిబ్డినం, టంగ్‌స్టన్ ఉన్నాయి. ఒడిషా, తమిళనాడు సముద్ర తీరాల్లో కూడా మోనజైట్ లోహం కలిగిన ఇసుక నిల్వలు పెద్దమొత్తంలో ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన మిడ్ వెస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అనే సంస్థ అరుదైన లోహాలతో అయస్కాంతాల తయారీని ప్రారంభించేందుకు ఇప్పటికే సిద్ధమైంది.

భారత్లో ఉన్న అపారమైన అరుదైన లోహ సంపద

• కీలక ఖనిజాలు, అరుదైన లోహాల సరఫరాపై ఒప్పందం
• రేర్ ఎర్త్ సప్లై చైన్ల రక్షణకు ద్వైపాక్షిక ఒడంబడిక
• మైనింగ్, ప్రాసెసింగ్‌తో పాటు రీసైక్లింగ్‌కూ ప్రాధాన్యత
• దిగుమతుల దశ నుంచి స్వావలంబన దిశగా అడుగులు
• ఆంధ్రప్రదేశ్‌లోనూ అరుదైన ఖనిజ నిల్వలు అపారం
• యూఎస్ డీల్‌తో భారత్లోనూ సిలికాన్ వ్యాలీలు
• ఎలక్ట్రానిక్స్, రక్షణ ఉత్పత్తులు, చిప్‌ల తయారీకి ఊతం

తాజా ఒప్పందం తోడైతే ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ పరికరాల తయారీలో భారత్ ఓ ప్రత్యామ్నాయ సరఫరా కేంద్రంగా అవతరించే అవకాశాలున్నాయి. భవిష్యత్‌లో అంతరిక్ష, వైమానిక, రక్షణ, హైటెక్ పరిశ్రమలు, బయోమెడికల్, స్మార్ట్ ఫోన్లు, 5జి, 6జి కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ అనూహ్యంగా పెరగనుంది. వీటి తయారీలో ఈ అరుదైన లోహాలు, ఖనిజాలు కీలకం.

21వ శతాబ్దంలో అభివృద్ధిలో రక్షణ వ్యూహాన్ని కూడా ఈ అరుదైన ఖనిజాలే శాసించగలుగుతాయి. వీటిపై పైచేయి సాధించిన దేశాలే వివిధ రంగాల్లో అగ్రగామిగా రూపుదిద్దుకుంటాయి. రాడార్ల నుంచి రోదసిని పరిశీలించే ఆధునిక టెలిస్కోప్ల తయారీలో ఈ ఆధునిక లోహాల వినియోగం పెరుగుతుంది. సెల్త్ విమానాలు, శత్రుదేశాలపై దాడులకు ఉపయోగించే డ్రోన్లు, క్షిపణులు, జలాంతర్గాముల నిర్దేశిత వ్యవస్థల తయారీకి కూడా ఈ అరుదైన లోహాలు అవసరం.

అమెరికాతో భారత్ చేసుకున్న తాజా ఒప్పందంతో ఈ రంగంలో చైనా ఆధిపత్యానికి కాస్త కలవరపాటు తప్పదు. గతంలో చైనా ఈ లోహాల ఎగుమతులపై నియంత్రణ విధించింది. ఆ సమయంలో అమెరికా, ఐరోపాల్లోని రక్షణ, హైటెక్ పరిశ్రమలు కలవరపాటుకు గురయ్యాయి.

భారత్ వంటి అపార నిల్వలున్న దేశం ఉత్పత్తి, శుద్ధి రంగాల్లో ముందడుగు వేస్తే ఈ లోహాల ఎగుమతుల్లో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఒప్పందం అరుదైన లోహాల నిల్వలు అపారంగా ఉన్న తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అరుదైన లోహాల పరిశ్రమల ఏర్పాటుతో ఇవి ఆధునిక సిలికాన్ వ్యాలీల్లా రూపుదిద్దుకోనున్నాయి.

Leave a Reply