ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, ‘అంత్యోదయ’ సాధనే ధ్యేయం

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, ‘అంత్యోదయ’ సాధనే ధ్యేయం

కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ

భీమవరం, ఆంధ్రప్రభ:
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి, ‘అంత్యోదయ’ సాధనే లక్ష్యంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నేటి నుంచి మూడు రోజుల పాటు అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో విస్తృత పర్యటన చేయనున్నారు.

ప్రధాని మోదీ ఆకాంక్షల మేరకు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఈ పర్యటన కొనసాగనుంది. మంగళవారం సాయంత్రం గౌహతికి చేరుకున్న కేంద్ర మంత్రి, అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మతో పాటు ఇతర కీలక నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయడంపై చర్చలు జరగనున్నాయి.

అనంతరం ఆయన మేఘాలయలో రెండు రోజుల పాటు అధికారిక పర్యటన కొనసాగిస్తారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రజా సంక్షేమ, మౌలిక వసతుల పథకాల అమలును ఆయన నేరుగా పరిశీలించనున్నారు.

మేఘాలయలోని సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనలు చేసి, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ‘అంత్యోదయ’ స్ఫూర్తితో సమాజంలోని చివరి వరుసలో ఉన్న వ్యక్తికి కూడా ప్రభుత్వ పథకాల ఫలాలు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Leave a Reply