ఇంద్రకీలాద్రిపై కుక్కల కలకలం.. భక్తుడిపై దాడి

ఇంద్రకీలాద్రిపై కుక్కల కలకలం.. భక్తుడిపై దాడి

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ:
ఆధ్యాత్మిక క్షేత్రంగా లక్షలాది భక్తుల విశ్వాసానికి నిలయమైన ఇంద్రకీలాద్రిపై ఇప్పుడు భక్తి కంటే భయం ఎక్కువగా కనిపిస్తోంది. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు వీధి కుక్కల బెడద తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

మంగళవారం హైదరాబాద్‌కు చెందిన వినయ్ దంపతులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉండగా అకస్మాత్తుగా ఒక వీధి కుక్క దాడి చేసి కాటు వేసింది. దీంతో భక్తుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

దేవస్థానం సిబ్బంది వెంటనే స్పందించి బాధితుడిని మహామండపం ఏడో అంతస్తులోని వైద్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే అక్కడ కుక్కకాటు నివారణకు అవసరమైన యాంటీ రేబిస్ ఇంజక్షన్ అందుబాటులో లేకపోవడం విమర్శలకు దారితీసింది. కేవలం టిటి ఇంజక్షన్‌తోనే చికిత్స చేయడం భక్తుల్లో అసంతృప్తిని పెంచింది.

క్యూలైన్లు, పరిసరాల్లో కుక్కల సంచారం

ప్రధాన గోపురం, రావిచెట్టు ప్రాంతం, మహామండపం, మెట్లదారి, క్యూలైన్ల వద్ద ఎక్కడ చూసినా వీధి కుక్కలు సంచరిస్తున్నాయని భక్తులు వాపోతున్నారు. భక్తుల మధ్యే స్వైర విహారం చేస్తున్న కుక్కలను నియంత్రించడంలో అధికారులు, భద్రతా సిబ్బంది విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

భద్రత పేరుతో భారీ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, కుక్కల సమస్యపై నిర్లక్ష్యం కొనసాగుతోందని భక్తులు మండిపడుతున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా కుక్కకాటు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు పుణ్యక్షేత్రాల్లో ఉండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

ఇంద్రకీలాద్రిపై వీధి కుక్కలను తక్షణం నియంత్రించి భక్తుల భద్రతకు శాశ్వత పరిష్కారం చూపాలని భక్తులు, స్థానికులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply