ట్యాంక్ బండ్ వద్ద బెల్లి లలిత విగ్రహం ఏర్పాటు చేయాలి..
ట్యాంక్ బండ్ వద్ద బెల్లి లలిత విగ్రహం ఏర్పాటు చేయాలి..
బీసీ జేఏసీ డిమాండ్
చెన్నూర్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: తెలంగాణ సామాజిక ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రజాగాయని, ఉద్యమకారిణి బెల్లి లలిత వర్ధంతి చెన్నూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలువురు నాయకులు ఆమె సేవలను స్మరించుకున్నారు. బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సిద్ది రమేష్ యాదవ్, మాజీ జడ్పీటీసీ మోతే తిరుపతి మాట్లాడుతూ బెల్లి లలిత తెలంగాణ సమాజ చైతన్యానికి ప్రతీక అని పేర్కొన్నారు.
గుట్కా నిషేధం, సారా నిషేధం, నల్గొండ ఫ్లోరైడ్ సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో బెల్లి లలిత కీలక పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గ్రామగ్రామాన తిరిగి పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన గాన కోకిలగా ఆమె గుర్తింపు పొందారని చెప్పారు.
ఆమె జీవితం నేటి యువతకు ఆదర్శమని, ఆమె పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సిద్ది రమేష్ యాదవ్ అన్నారు. బెల్లి లలిత జీవిత చరిత్రను రాష్ట్ర పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద బెల్లి లలిత విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అలాగే భువనగిరి జిల్లాకు ఆమె పేరు పెట్టాలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది.
