వైద్య సేవలు వెంటనే అందుబాటులోకి తేవాలి
వైద్య సేవలు వెంటనే అందుబాటులోకి తేవాలి
- మహబూబ్‌నగర్‌లో నిలిచిపోయిన వైద్య, పర్యాటక ప్రాజెక్టులు పూర్తి చేయాలి
- మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రారంభానికి నోచుకోని వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, టూరిజం ప్లాజా తదితర అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, టూరిజం ప్లాజా నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, జిల్లాలో అత్యాధునిక వైద్య సేవల అవసరాన్ని గుర్తించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేయించామని తెలిపారు. జిల్లాకు తొలి మెడికల్ కాలేజీని తీసుకువచ్చి, ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధునిక సదుపాయాలు కల్పించినట్లు గుర్తు చేశారు.

క్యాన్సర్, గుండె, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పేద ప్రజలకు జిల్లా కేంద్రంలోనే మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేశామని చెప్పారు. అయితే భవనం సిద్ధంగా ఉన్నప్పటికీ రూ.500 కోట్ల విలువైన వైద్య పరికరాల ఏర్పాటు, సిబ్బంది నియామకం వంటి పనులు రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని విమర్శించారు.
ఐదు నుంచి ఆరు జిల్లాల ప్రజలకు ఉపయోగపడే ఈ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితం కాకుండా అవసరమైన పరికరాలు, వైద్య సిబ్బంది, వసతులు కల్పించి పూర్తి స్థాయిలో సేవలు అందించాలని సూచించారు.

పర్యాటక రంగ అభివృద్ధిపై కూడా స్పందించిన ఆయన, సోమశిల, ఈగలపెంట, మన్ననూరు, జోగులాంబ ప్రాంతాల్లో చేపట్టిన పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. రోగుల బంధువుల కోసం ఆస్పత్రి సమీపంలో నిర్మిస్తున్న టూరిజం ప్లాజా, కన్వెన్షన్ సెంటర్ పనులను పూర్తి చేయాలని కోరారు.
అలాగే మన్యంకొండ రోప్‌వే, హరిత హోటల్ విస్తరణ, శిల్పారామం, చిల్డ్రన్స్ అమ్యూజ్‌మెంట్ పార్క్, ట్యాంక్‌బండ్ అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ట్యాంక్‌బండ్‌లో నెక్లెస్ రోడ్, ఉమెన్స్ పార్క్, ఫుడ్ కోర్టు, సీనియర్ సిటిజన్ ట్రాక్, సైకిల్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్ తదితర ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, మండల అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
