గాలివాన గర్జన..
గాలివాన గర్జన..
మైలవరం మండలంలో భారీ నష్టం
మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం మండలంలో సోమవారం సాయంత్రం సంభవించిన భారీ గాలివాన భీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల ధాటికి మండలంలోని మైలవరం, చండ్రగూడెం, పొందుగల, వెల్వడం గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోగా, విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో గ్రామాలు రాత్రంతా అంధకారంలో మునిగిపోయాయి.
విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఉక్కపోతలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలివాన ప్రభావంతో పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల ఇళ్ల పైకప్పులు, గోడలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
ప్రధాన రహదారుల వెంట ఏర్పాటు చేసిన హోర్డింగులు కూలిపోగా, ఫ్లెక్సీ బ్యానర్లు గాలికి ఎగిరిపోయాయి. వెల్వడం గ్రామానికి చెందిన రైతు పి. గోపాల్‌కు చెందిన మామిడి తోటలో పలుచెట్లు నేలకొరిగాయి. చెట్లపై ఉన్న మామిడి కాయలు భారీగా రాలిపోవడంతో రైతుకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది.
గాలివాన అనంతరం విద్యుత్ శాఖ సిబ్బంది తెగిపోయిన తీగలు, కూలిన స్తంభాల మరమ్మతు పనులు చేపట్టారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం ప్రజలు రాత్రంతా ఎదురుచూశారు.
