45Degrees | నిపుణుల హెచ్చరికలు!
45Degrees | నిపుణుల హెచ్చరికలు!
45Degrees | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరిగి పోతుంది. మే నెల ముగుస్తున్నా ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. మరో వైపు రుతుపవనాల రాకా ఆలస్యం కావడంతో ఎండ వేడికి అల్లడిపోతున్నారు. మరో వైపు ఎండలపై భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర మంత్రిత్వ శాఖ తీవ్ర వడగాలలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు ఇస్తోంది.
45 డిగ్రీలు దాటుతున్నా..
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా వాయువ్య, మధ్య తూర్పు భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 46 నుంచి 47 డిగ్రీలు వరకు ఎండలు దంచికొడుతున్నాయి. పెరుగుతున్న ఎండలకు తోడు గాలిలో తేమశాతం సాధారణం కంటే పడిపోవడంతో వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే వడ దెబ్బ కారణంగా చాలా మంది మృత్యువాత పడ్డారు. దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుండి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ఇప్పటికే పలు రాష్ట్రాలకు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించింది. ఉదయం 10 గంటలకే బయటకు రావాలంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొంది.
తేమ శాతం తగ్గడం..
ప్రస్తుతం ఎండలతో పాటు గాలిలో తేమ శాతం దారుణంగా పడిపోతోంది. దీనిని వాతావరణ భాషలో ‘డ్రై హీట్’ లేదా పొడి వాతావరణం అంటారు. సాధారణంగా గాలిలో తేమ ఉంటే చెమట పడుతుంది. కానీ తేమ శాతం బాగా తగ్గిపోయినప్పుడు, శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు రాకముందే గాలిలోకి ఆవిరైపోతుంది. దీనివల్ల మనకు చెమట పట్టడం లేదనిపిస్తుంది కానీ, శరీరం చాలా వేగంగా నిర్జలీకరణానికి గురవుతుంది. ఉక్కపోత లేకపోవడం వల్ల ఎండ తీవ్రతను ప్రజలు త్వరగా గుర్తించలేరు. ఫలితంగా అనుకోకుండానే ‘సన్ స్ట్రోక్’ లేదా వడదెబ్బకు గురవుతుంటారు.
వాతావరణ మార్పుల వల్ల ఏటా ఎండల తీవ్రత పెరుగుతూనే ఉంది. సామాజిక మాధ్యమంలో వచ్చే హెచ్చరికలను లైట్ తీసుకోకుండా, ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిన సమయం ఇది. అప్రమత్తంగా ఉండటమే వడదెబ్బ నుంచి మనల్ని మనం కాపాడుకునే ఏకైక మార్గం.
CLICK HERE TO READ Traffic Police |ఎండ దెబ్బకు పోలీసుల మాస్టర్ ప్లాన్!
