మంత్రి జూపల్లి ఆదేశాలతో రైతులకు అన్యాయం

మంత్రి జూపల్లి ఆదేశాలతో రైతులకు అన్యాయం
స్థానిక రైతుల ధాన్యాన్ని పక్కన పెట్టారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపణ
నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ నియోజకవర్గ రైతుల ధాన్యాన్ని అన్‌లోడ్ చేయకుండా, మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో కొల్లాపూర్ నియోజకవర్గ రైతుల లారీలకు ప్రాధాన్యం ఇస్తున్నారని టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.
మంగళవారం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని ఇంద్రకల్ గ్రామంలో ఉన్న మణికంఠ మిల్లులో ధాన్యం బస్తాల లోడింగ్, అన్‌లోడింగ్ పరిస్థితిని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ రైతుల ధాన్యాన్ని అన్‌లోడ్ చేయకుండా, కొల్లాపూర్‌కు చెందిన దళారుల లారీలకు మంత్రి ఒత్తిడితో ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. స్థానిక రైతులను పక్కన పెట్టడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం దళారుల వ్యవస్థకు మద్దతు ఇస్తోందా అని ప్రశ్నించారు. రైతుల పంటలను వెంటనే కొనుగోలు చేసి ట్రాక్టర్లను దించాలని డిమాండ్ చేశారు.
రైతుల పట్ల వివక్ష చూపితే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. రైతు సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి నాగర్‌కర్నూల్ రైతుల ధాన్యానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని మార్కెటింగ్ శాఖ అధికారులను కోరారు.
సోమవారం మంత్రి సూచనల మేరకు దాదాపు 20 నుంచి 30 కొల్లాపూర్ లారీల ధాన్యాన్ని నాగర్‌కర్నూల్ రైతుల ధాన్యాన్ని పక్కన పెట్టి అన్‌లోడ్ చేశారని మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.
రైతులకు తక్షణమే అన్ని సౌకర్యాలు కల్పించి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
