కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపు..

కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపు..
- జగిత్యాలను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడం లక్ష్యం..
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల, ఆంధ్రప్రభ ; జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్ శివారులోని సర్వే నెంబర్ 437లో స్థలం కేటాయించినట్లు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు కలిసి నర్సింగాపూర్ లోని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించే స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఇన్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేసి ముందుకు సాగుతున్నారన్నారు.
జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయాన్ని నర్సింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు, ఇందుకోసం 6 ఎకరాల స్థలాన్ని సర్వే నెంబర్ 437లో కేటాయిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇప్పటికే రూ. 33 కోట్లతో ఐటిఐ, ఈ ఏటీసీ సెంటర్ ను ఇక్కడ ఏర్పాటు చేశామని, వృద్ధ ఆశ్రమం సైతం ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందని తెలిపారు.
చల్ గల్ లోని వ్యవసాయ పరిశోధనకు సంబంధించిన వాలంతరీ భూములను 12 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి కేటాయించడం జరిగిందని, కేంద్రీయ విద్యాలయానికి రెండు ఎకరాల స్థలం సరిపోదని వివాదం నేపథ్యంలో నర్సింగాపూర్ లో ప్రభుత్వ భూమి కేటాయిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం చల్ గల్ మరిన్ని వ్యవసాయ పరిశోధనలు జరగాల్సిన నేపథ్యంలో వ్యవసాయ పరిశోధనల భవిష్యత్తు అవసరాల కోసం అక్కడి భూములను అంతకు మించి కేటాయించే అవకాశం లేదన్నారు. నర్సింగాపూర్ భూముల ప్రతిపాదనలు జిల్లా అధికారుల ద్వారా కేంద్రీయ విద్యాలయ అధికారులకు ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని ఎందుకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు.
