కాంగ్రెస్తోనే దళితుల అభివృద్ధికి భరోసా
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ బలోపేతంతోనే దళితుల అభివృద్ధికి భరోసా ఉంటుందని సంగారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గంగేరి శ్రీహరి అన్నారు. సోమవారం దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ ఎస్సీ సెల్ జాతీయ సమావేశం ఢిల్లీలోని ఇందిరా భవన్లో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్పర్సన్ల జాతీయ స్థాయి సమావేశానికి సంగారెడ్డి జిల్లా నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గంగేరి శ్రీహరి హాజరయ్యారు.
ఈ సమావేశానికి రాజేంద్రపాల్ గౌతమ్ అధ్యక్షత వహించారు. సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ఎస్సీ సెల్ కార్యకలాపాల విస్తరణ, సామాజిక న్యాయం, దళితుల అభ్యున్నతి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్టు శ్రీహరి తెలిపారు.
ఈ సందర్భంగా గంగేరి శ్రీహరి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తోందన్నారు. యువత, దళిత నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రతినిధులు, జిల్లా చైర్పర్సన్లు పాల్గొన్నట్టు శ్రీహరి తెలిపారు.
