Tamil Nadu | యువతి ఇంటిపై ఉన్మాది వీరంగం

Tamil Nadu | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : తమిళనాడులోని కోయంబత్తూరు పరిధి తొండముత్తూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రేమను తిరస్కరించిందనే కక్షతో ఓ యువకుడు యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. తన ప్రేమను యువతి అంగీకరించకపోవడంతో ఆగ్రహానికి గురైన యువకుడు తన స్నేహితుడితో కలిసి బైక్పై యువతి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం వెంట తెచ్చుకున్న రెండు పెట్రోల్ బాంబులను ఇంటిపైకి విసిరాడు.
పెట్రోల్ బాంబులు పడటంతో ఇంటి వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వారి సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
