YSRCP | కళ్లుమూసి తెరిచేలోపు మూడేళ్లు గడిచిపోతాయ్…

YSRCP | కళ్లుమూసి తెరిచేలోపు మూడేళ్లు గడిచిపోతాయ్…
YSRCP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను బుధవారం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు. అక్కడ స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, వారి కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ…. వైసీపీ హయాంలో రాష్ట్రంలో నాలుగు కొత్త పోర్టులకు శ్రీకారం చుట్టామన్నారు. 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు తెచ్చామన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి కృషి చేశామన్నారు. రూ.26వేల కోట్ల పెట్టుబడులతో పనులు చేపట్టామన్నారు. అన్ని రకాల అనుమతులతో పోర్టులను ప్రారంభించామన్నారు.
మారిటైమ్ బోర్డు తీసుకొచ్చి పనులు వేగవంతం చేశామన్నారు. దాదాపు 95 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశామన్నారు. మూలపేట పోర్టు పనులు కూడా 35శాతం పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె మరో ఉదాహరణ అన్నారు. కాకినాడ పోర్టు పనులు కూడా వేగవంతం చేశామన్నారు.
మచిలీపట్నం పోర్టులో కూడా 35శాతం పనులు చేశామన్నారు. రామాయపట్నం పోర్టు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయన్నారు.
మిగిలిన పనులు కూటమి సర్కార్ ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. మార్చి 12, 2024న వర్చువల్ గా జువ్వలదిన్నె ప్రారంభించామన్నారు. ఆంధ్ర తీరంలో ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక పోర్టును ప్లాన్ చేశామన్నారు. 10 ఫిషింగ్ హార్బర్లను తీసుకొచ్చామన్నారు.
ఏపీ ఎకనామిక్ గ్రోత్ కు ఊతం ఇచ్చేలా ప్రణాళికలు చేశామన్నారు.
చంద్రబాబు ఏనాడూ పోర్టులు, హార్బర్ల గురించి ఆలోచన చేయలేదన్నారు. జువ్వలదిన్నెను జాతికి అంకితం చేసి రెండేళ్లు అవుతోందన్నారు.
రెండేళ్లు అవుతున్నా మత్య్సకారుల చేతికి ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. జువ్వలదిన్నెలో 41 వేల టన్నుల మత్స్య సంపద దొరుకుతుందన్నారు.
