రైతులకు భరోసా.. కొనుగోళ్లపై కీలక ప్రకటన

చెన్నూర్, ఆంధ్రప్రభ: చెన్నూర్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు.
సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోలో మంత్రి మాట్లాడుతూ, ఈ సీజన్‌లో చెన్నూర్ నియోజకవర్గంలో వరి పంట అంచనాలకు మించి దిగుబడి వచ్చిందన్నారు. ప్రస్తుతం అకాల వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం ద్వారా కొనుగోలు ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా పూర్తవుతుందని పేర్కొన్నారు.
ధాన్యం నిల్వ కోసం అవసరమైన గోదాముల సౌకర్యాలను పెంచుతున్నామని, హమాలీల సంఖ్యను కూడా పెంపొందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లారీలకు అదనంగా 75 లారీలను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
జిల్లా కలెక్టర్‌తో పాటు అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తోందని మంత్రి తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
రాబోయే వారం రోజుల్లో రైతుల వద్ద ఉన్న ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేసి, ప్రభుత్వ నిర్దేశిత మద్దతు ధరను చెల్లిస్తామని స్పష్టం చేశారు. రైతులు ఆలస్యం చేయకుండా తమ వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు.
