ఈసారి మహానాడులో ప్రత్యేక ఆకర్షణ ఏంటి..?

ఈసారి మహానాడులో ప్రత్యేక ఆకర్షణ ఏంటి..?
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : మహానాడులో స్త్రీ శక్తికి పెద్దపీట వేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. పశ్చిమ ఆసియా దేశాల యుద్ధ ప్రభావంతో పొదుపు చర్యల్లో భాగంగా డిజిటల్ మహానాడుకు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టిందని, దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మహానాడును విజయవంతం చేయాలని కోరుతూ మైలవరం నియోజకవర్గ క్లస్టర్, మండల పార్టీ కమిటీల నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ స్థాయిలో డిజిటల్ మహానాడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 1875 క్లస్టర్లలో కనులపండువగా మహానాడు కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు.
ప్రతి క్లస్టర్లో ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు. రెండు రోజుల పాటు జరిగే మహానాడును జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సారథ్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
లైవ్ టెలికాస్ట్ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, క్లస్టర్ యూనిట్ ఇన్చార్జులు, నియోజకవర్గ ఇన్చార్జులు పాల్గొంటారని తెలిపారు. మొదటి రోజు అన్న ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు అర్పించడం, పార్టీ జెండా ఆవిష్కరణ, సీనియర్ నాయకులకు సన్మానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడును పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
