మంత్రి జూపల్లి ఆకస్మిక రైస్ మిల్లుల తనిఖీలు..

మంత్రి జూపల్లి ఆకస్మిక రైస్ మిల్లుల తనిఖీలు..
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్లు, చందుబట్ల మండలంలోని శ్రీ వెంకటేశ్వర అగ్రో ఇండస్ట్రీస్‌లో రైస్ మిల్లులో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లుల్లో ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియ గురించి మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజుల తరబడి ధాన్యం అన్ లోడ్ చేయకుండా లారీలను నిలిపివేసారంటూ మిల్లు యాజమాన్యాల పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి జూపల్లి వార్నింగ్ ఇచ్చారు.
కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకుపోవడానికి గల కారణాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రోజుల తరబడి లారీల్లోనే ధాన్యం ఉండటం పై మిల్లు యజమానుల తీరు పై మంత్రి మండిపడ్డారు. రైతులకు నష్టం కలిగించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. రైస్ మిల్లులు, గోదాముల వద్ద ప్రతి లారీ అన్‌లోడ్ అయ్యేలా పర్యవేక్షించాలని ఎస్పీకి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మిల్లులు, గోదాముల వద్ద పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరగకుండా, వెంటనే మిల్లులకు తరలించి అన్‌లోడ్ చేయాలని అధికారులకు ఆదేశించారు.

