వట్టెం రిజర్వాయర్ ఆయకట్టు పనులను పూర్తి చేయాలి..

వట్టెం రిజర్వాయర్ ఆయకట్టు పనులను పూర్తి చేయాలి..
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ జలసౌధలో రాష్ట్ర సాగునీటి మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ పురోగతి, పెండింగ్ పనులు, త్వరితగతిన పూర్తి చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో పాల్గొన్న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని కోరారు. అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్ట్ల అభివృద్ధికి సుమారు రూ.5,000 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే వట్టెం రిజర్వాయర్ ఆయకట్టు కాలువల పనులను కూడా వెంటనే ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేసి సుమారు రూ. 1.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతులకు పెద్ద ఎత్తున లాభం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. పాలమూరు ప్రాంత అభివృద్ధి మరియు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని సమావేశంలో స్పష్టం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
