Fertilizer mafia Andhra Pradesh | సబ్సిడీ ఎరువుల అక్రమాలపై భారీ దర్యాప్తు

Fertilizer mafia Andhra Pradesh | సబ్సిడీ ఎరువుల అక్రమాలపై భారీ దర్యాప్తు
Fertilizer mafia Andhra Pradesh | 28 జిల్లాల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీలు
డీలర్లపై సస్పెన్షన్ చర్యలు
బ్లాక్ మార్కెట్‌పై కేంద్రం సీరియస్
రైతుల సబ్సిడీ ఎరువులపై కట్టుదిట్టమైన నిఘా
Fertilizer mafia Andhra Pradesh | అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో సబ్సిడీ ఎరువుల అక్రమాలపై “ఆంధ్రప్రభ” వెలుగులోకి తెచ్చిన సంచలన కథనం ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించింది. రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీతో అందజేస్తున్న యూరియా, డీఏపీ ఎరువులు బ్లాక్ మార్కెట్ ద్వారా ఇతర రాష్ట్రాలకు, పారిశ్రామిక అవసరాలకు మళ్లుతున్నాయన్న ఆరోపణలను కేంద్రం సైతం సీరియస్‌గా తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలకు దిగింది.
సబ్సిడీ ఎరువుల అక్రమ రవాణా, అధిక ధరలకు విక్రయాలు, స్టాక్ మళ్లింపులు, నకిలీ బిల్లుల వ్యవహారాలపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ను చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీల్లో జిల్లా వ్యవసాయాధికారి కన్వీనర్‌గా ఉండగా, జిల్లా ఎస్పీ, సహకారశాఖాధికారి, మార్కెటింగ్ శాఖ ప్రతినిధులు, ఎరువుల కంపెనీల అధికారులు సభ్యులుగా ఉంటారు. రైతులకు చేరాల్సిన సబ్సిడీ ఎరువులు మధ్యలోనే మాయమవుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇకపై ప్రతి బస్తా కదలికపై నిఘా పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
కేంద్ర దర్యాప్తులో వెలుగులోకి..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎరువుల అమ్మకాల్లో అసాధారణ లావాదేవీలు జరుగుతున్నాయన్న సమాచారం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ దృష్టికి వెళ్లింది. దీంతో కేంద్ర బృందాలు నేరుగా రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టాయి. ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఎరువుల అమ్మకాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా భారీ వ్యత్యాసాలు బయటపడ్డాయి.
ముఖ్యంగా రైతుల అవసరాలకు మించి పెద్ద మొత్తాల్లో యూరియా, డీఏపీ విక్రయాలు నమోదైనట్లు గుర్తించారు. అధికారులు విచారణలో డీలర్లు రైతుల పేర్లతో బిల్లులు సృష్టించి ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక అవసరాలకు యూరియా వినియోగం పెరగడంతో ఈ అక్రమ వ్యాపారం కోట్ల రూపాయల స్థాయికి చేరిందని అధికారులు భావిస్తున్నారు.
ఎరువుల మాఫియాపై..
ఆంధ్రప్రభ కథనంతో కదిలిన ప్రభుత్వం
10 మంది డీలర్లపై సస్పెన్షన్ వేట
కేంద్ర బృందాల నివేదికల ఆధారంగా వ్యవసాయశాఖ ఇప్పటికే పది మంది ఎరువుల డీలర్ల లైసెన్సులను సస్పెండ్ చేసింది. ఆయా వ్యాపారుల విక్రయాల రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, బిల్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని చోట్ల స్టాక్ రికార్డులు, రైతుల ఆధార్ వివరాలు, అమ్మకాల వివరాల్లో భారీ తేడాలు బయటపడినట్లు సమాచారం.
రైతులకు అమ్మినట్లు చూపించిన ఎరువులు వాస్తవానికి ఇతర రాష్ట్రాలకు తరలించారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. రైతుల పేరుతో జరిగే మోసాలను సహించబోమని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.
సబ్సిడీ ఎరువుల దారిమళ్లింపుల వ్యవహారం ఢిల్లీ స్థాయిలో చర్చకు రావడం రాష్ట్ర అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. కేంద్ర వ్యవసాయ, ఎరువుల శాఖల ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యవసాయశాఖతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఈ అంశాన్ని తీవ్రంగా ప్రస్తావించినట్లు తెలిసింది. రైతులకు ఇచ్చే సబ్సిడీ ఎరువులు ఎలా వెళ్తున్నాయి, ఎందుకు అసాధారణ అమ్మకాలు నమోదవుతున్నాయంటూ కేంద్రం వివరణ కోరినట్లు సమాచారం.
ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై జిల్లాల వారీగా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ఇకపై ఎరువుల నిల్వలు, అమ్మకాలు, రవాణాపై రియల్ టైమ్ మానిటరింగ్ అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఖరీఫ్‌కు 2.5 లక్షల టన్నుల డిమాండ్
ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు రాష్ట్రానికి సుమారు రెండు లక్షల టన్నుల ఎరువులను కేంద్రం కేటాయిస్తోంది. అయితే ఈసారి సాగు విస్తీర్ణం పెరగడం, పంటల మార్పిడి కారణంగా ఖరీఫ్‌కు 2.5 లక్షల టన్నుల ఎరువులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇప్పటికే కేంద్రం సుమారు 52 వేల టన్నుల ఎరువులను రాష్ట్రానికి పంపింది.
అయితే అక్రమాల అంశం వెలుగులోకి రావడంతో మిగిలిన సరఫరాపై కూడా కేంద్రం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడా కొరత లేకుండా, అదే సమయంలో బ్లాక్ మార్కెట్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం రైతులకు డీఏపీ, యూరియా ఎరువులను భారీ సబ్సిడీతో అందిస్తోంది. మార్కెట్లో సుమారు రూ.3 వేల వరకు ఉండే 50 కిలోల డీఏపీ బస్తాను రైతులకు సుమారు రూ.1350కే అందజేస్తోంది. అలాగే మార్కెట్ విలువ రూ.2200 దాటే యూరియా బస్తాను కేవలం రూ.266.50కే సరఫరా చేస్తోంది. అంటే ఒక్కో బస్తాపై కేంద్రం దాదాపు రూ.2 వేల వరకు భారం మోస్తోంది.
ఇదే అక్రమార్కులకు భారీ లాభాల మార్గంగా మారిందని అధికారులు చెబుతున్నారు. పారిశ్రామిక అవసరాలకు యూరియా టన్ను సుమారు రూ.75 వేల వరకు విక్రయమవుతుండటంతో కొందరు వ్యాపారులు రైతుల కోటాలోని ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు మళ్లిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ప్రతి బస్తాపై నిఘా
టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటుతో ఇకపై జిల్లాల వారీగా ప్రత్యేక దాడులు, ఆకస్మిక తనిఖీలు పెరగనున్నాయి. ఎరువుల గోదాములు, రిటైల్ దుకాణాలు, రవాణా వాహనాలు, స్టాక్ పాయింట్లపై అధికారులు కన్ను వేస్తారు. రైతుల ఆధార్, ఈ-పాస్ మెషిన్ల ద్వారా జరిగిన అమ్మకాల వివరాలను కూడా పరిశీలించనున్నారు.
ఎక్కడైనా అసాధారణ విక్రయాలు కనిపిస్తే వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రైతుల కోసం ఇచ్చే సబ్సిడీ ఒక్క రూపాయి కూడా దారి మళ్లకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో ఎరువుల మాఫియాపై ఇదే అతిపెద్ద ఆపరేషన్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
