AI impact on jobs | క్యాంపస్ నియామకాలపై ఏఐ ప్రభావం

AI impact on jobs | క్యాంపస్ నియామకాలపై ఏఐ ప్రభావం
AI impact on jobs | ఇంజినీరింగ్ విద్యార్థుల్లో పెరుగుతున్న ఆందోళన
కోర్ ఇంజినీరింగ్ ప్లేస్‌మెంట్లలో భారీ తగ్గుదల
తక్కువ ప్యాకేజీలతో నిరాశలో ఫ్రెషర్లు
స్కిల్ ఆధారిత ఉద్యోగాల వైపు మారుతున్న ఐటీ రంగం
AI impact on jobs | హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: వేగంగా దూసుకొస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు కాలేజీ క్యాంపస్ నియామకాలనూ ప్రభావితం చేస్తోంది. ఏఐ టెక్నాలజీతో ఉద్యోగుల తొలగింపులకు దిగ్గజ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. భారీ సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా డిగ్రీలు చేతబట్టుకున్న ఇంజినీరింగ్ పట్టభద్రులు విలవిలాడిపోతున్నారు.
గతంలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లోనే సాఫ్ట్‌వేర్ సంస్థలు క్యాంపస్‌లకు వచ్చేవి. అవసరమైన ప్లాట్‌ఫామ్‌లలో రాత పరీక్ష నిర్వహించి, ఆపై మౌఖిక ఇంటర్వ్యూలు జరిపి, అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు జారీ చేసేవి. కానీ ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది.
ఏఐ దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అటు కళాశాల యాజమాన్యాలు, ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. ఐటీ రంగంలో కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు, మార్కెట్ మందగమనం, అలాగే కృత్రిమ మేధస్సు ప్రభావంతో ఇంజినీరింగ్ కళాశాలల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభను ఎదుర్కొంటున్నారు.
ఈ ప్రభావం ఇంజినీరింగ్ ప్రవేశాలపై పడుతుందన్న ఆందోళనలో వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో (2025-26) తెలుగు రాష్ట్రాల్లో టాప్ 50 ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు (ప్లేస్‌మెంట్లు) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయని, కొన్ని కాలేజీల్లో ఒక్కరికీ కూడా ఉద్యోగం రాలేదని విద్యాసంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.
ఫ్రెషర్లకు ఉద్యోగాల కష్టాలు
ఉద్యోగాలు పొందిన విద్యార్థుల్లో కూడా చాలామందికి తమ ఇంజినీరింగ్ చదువుతో సంబంధం లేని సేల్స్, మార్కెటింగ్, ఎడ్‌టెక్ రంగాల్లోనే అవకాశాలు లభిస్తున్నాయట.
కోర్‌కు జీరో ప్లేస్‌మెంట్లు..
హైదరాబాద్ నగరంలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల నిర్వాహకుడు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌పై స్పందిస్తూ, తెలుగు రాష్ట్రాల్లో 150 ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీసం 100 కాలేజీలు కోర్ ఇంజినీరింగ్ ప్లేస్‌మెంట్లు పొందడంలో విఫలమయ్యాయని చెప్పారు. కొన్ని కళాశాలలు నాన్-ఐటీ, నాన్-ఇంజినీరింగ్ కంపెనీలను క్యాంపస్‌కు తీసుకొస్తున్నాయని ఆ ప్రతినిధి తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు వేగంగా తగ్గిపోతున్నాయని, ఈ పరిస్థితి మరో రెండేళ్లు కొనసాగవచ్చని అన్నారు. మరో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకుడు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. దాదాపు 80 శాతం కాలేజీలు ప్లేస్‌మెంట్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
కొన్ని కాలేజీలు మంచి ప్లేస్‌మెంట్లు వచ్చాయని ప్రచారం చేస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని, అడ్మిషన్లు పడిపోకుండా ఉండేందుకు కన్సల్టెన్సీల సహాయంతో మెరుగైన చిత్రాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మాట్లాడుతూ, మా కాలేజీలో ఇప్పటివరకు ఒకే ఒక విద్యార్థికి క్యాంపస్ ప్లేస్‌మెంట్ వచ్చింది. కొన్ని కంపెనీలు కస్టమర్ సర్వీస్, సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగాల కోసం వచ్చినా వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల మధ్య మాత్రమే ఆఫర్ చేశాయి. తక్కువ జీతం కారణంగా చాలా మంది ఆ అవకాశాలను తిరస్కరించారని ఆ విద్యార్థి తెలిపాడు.
దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 15 లక్షలకుపైగా ఇంజినీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. అయితే అందరికీ క్యాంపస్ ద్వారా ఉద్యోగాలు లభించడం లేదు.
కష్టకాలం?
ఏఐ టూల్స్‌తో ఎంట్రీ లెవల్ కోడింగ్, టెస్టింగ్, సపోర్ట్ ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఐటీ కంపెనీలు భారీ స్థాయిలో కొత్త నియామకాలకు వెనుకంజ వేస్తున్నాయి. ఆటోమేషన్ కారణంగా ఒకే పనిని తక్కువ మంది ఉద్యోగులతో నిర్వహిస్తున్నాయి. క్యాంపస్‌లకు వచ్చే కంపెనీల సంఖ్య గణనీయంగా పడిపోయింది. వచ్చిన కంపెనీలు కూడా చాలా తక్కువ ప్యాకేజీలతోనే ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి.
ఇలాంటి సమయంలో కేవలం డిగ్రీ మాత్రమే సరిపోదు. విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్న్‌షిప్‌లపై దృష్టి పెట్టాలని, కోర్ ఇంజినీరింగ్‌తోపాటు మల్టీ-స్కిల్ సామర్థ్యాలు పెంచుకుంటేనే అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో…
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి కొంత మిశ్రమంగా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు మంచి ప్లేస్‌మెంట్లు సాధిస్తున్నప్పటికీ, అనేక టియర్-3 కళాశాలల్లో ప్లేస్‌మెంట్ శాతం తగ్గింది.
ఉదాహరణకు విజయవాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో 2025-26 సంవత్సరంలో ప్లేస్‌మెంట్ సీజన్‌లో 1,054 ఆఫర్లు సాధించగా, గరిష్ట ప్యాకేజ్ రూ.46 లక్షలుగా నమోదైంది. 87కి పైగా కంపెనీలు క్యాంపస్‌కు వచ్చాయి. అయితే గ్రామీణ ప్రాంతాల ఇంజినీరింగ్ కళాశాలల్లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని అధ్యాపకులు చెబుతున్నారు.
మొత్తం మీద ఇంజినీరింగ్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పూర్తిగా క్షీణించలేదు. కానీ పాత విధానం మాత్రం ముగిసిపోతోంది. ఏదో ఒక ఐటీ ఉద్యోగం వస్తుందన్న పరిస్థితి ఇక లేదు. ఏఐ ప్రభావంతో ఉద్యోగాల సంఖ్య కంటే, నాణ్యత, నైపుణ్యాల ప్రాముఖ్యత పెరిగింది. స్కిల్-సెంట్రిక్ విద్యపై దృష్టి పెట్టకపోతే ప్లేస్‌మెంట్ సంక్షోభం పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
వివిధ అధ్యయనాల ప్రకారం టాప్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సగటు ప్లేస్‌మెంట్ రేటు 75-80 శాతం మధ్య ఉండగా, టియర్-2, టియర్-3 కళాశాలల్లో ఇది 35-60 శాతం వరకు మాత్రమే ఉంది. డెలాయిట్ నివేదిక ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ నియామకాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఏఐ సాధారణ పనులను తగ్గిస్తున్నప్పటికీ, కొత్త తరహా ఉద్యోగాలను కూడా సృష్టిస్తోంది. ఫుల్-స్టాక్ ఏఐ ఇంజినీర్, ఏఐ టెస్టింగ్ ఇంజినీర్, ప్రాంప్ట్ ఇంజినీర్, డేటా ఇంజినీర్, ఎంఎల్ ఆప్స్ వంటి పోస్టులకు డిమాండ్ పెరుగుతోంది. పలు కంపెనీలు ప్రత్యేకంగా ఏఐ నైపుణ్యాలున్న ఫ్రెషర్ల కోసం ఆఫ్-క్యాంపస్ డ్రైవ్లు నిర్వహిస్తున్నాయి.
