- మూడు చక్రాల బండికి తగ్గిన ఆదాయం
- ఆర్థిక ఇబ్బందుల్లో ఆటో డ్రైవర్లు
- ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని మరచిన ప్రభుత్వం
- అటకెక్కిన ఏడాదికి రూ.12వేల ఎన్నికల హామీ
నర్సింహులపేట, ఏప్రిల్9(ఆంధ్రప్రభ): మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ప్రస్తుతం ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఆ పథకం అమలు కావడంతో ఆటో డ్రైవర్ల ఆదాయం క్రమంగా తగ్గింది. ఆటోలు నడుపుతూ కుటుంబాలను పోషించుకునే డ్రైవర్లు ఆర్థిక ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేని గ్రామాల్లో మాత్రమే కొంత మంది.. కొంత దూరం ప్రయాణాన్ని ఆటోల్లో మాత్రమే కొనసాగిస్తున్నారు..
నర్సింహులపేట మండలంలో 120 ఆటోలు…
మండల వ్యాప్తంగా సుమారు 120ఆటోలు ఉన్నాయి. నర్సింహులపేట నుండి వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారి వరకు, మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి నడుస్తాయి. ఆటో జీవనమే ప్రధానాధారంగా కుటుంబాలు పోషించుకుంటున్నారు. వచ్చే ఆదాయంతో ఆటో ఫైనాన్స్ చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఆటో ట్రిప్పులు తగ్గిపోవడంతో ఆదాయం తగ్గి అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కుటుంబాలను, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
ప్రతి ఆటో డ్రైవర్ కు రాజీవ్ యువశక్తి వికాసం పథకం అందించాలి.. బత్తుల రమేష్
ప్రభుత్వం ఆటోవాలాలను ఆదుకొని సమస్యలు పరిష్కరించాలి. ఏళ్ల తరబడి ఆటో నడపడమే జీవనాధారంగా జీవిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పొద్దంతా ఉన్నా ఆటో ఎక్కేవారు లేరు. ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది.
ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చాలి.. ఆటో యూనియన్ అధ్యక్షుడు, బొమ్మగాని సురేష్
ఆటోవాలాల సామాజిక భద్రత కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఎన్నికల హామీలో భాగంగా ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించి ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి.