వరి ధాన్యాన్ని నిబంధనల ప్రకారం నిల్వ చేయాలి

వరి ధాన్యాన్ని నిబంధనల ప్రకారం నిల్వ చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
దండేపల్లి, ఆంధ్రప్రభ : రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం గోదాములు, రైస్ మిల్లులలో నిబంధనల ప్రకారం నిల్వ చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం దండేపల్లి మండలంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్, రాధాకృష్ణ రైస్ మిల్, రామ్ లక్ష్మణ్ రైస్ మిల్, జయలక్ష్మి రైస్ మిల్ లను జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా మేనేజర్, మండలం పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి సందర్శించి ధాన్యం ప్రక్రియను పరిశీలించారు.
లక్ష్మీనరసింహ గోదామును సందర్శించి ధాన్యం తరలింపు, నిల్వ లకు సంబంధించి అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల నుండి నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన ధాన్యాన్ని గుర్తించిన గోదాములకు, రైస్ మిల్లులకు కేటాయించిన ప్రకారం తరలించడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ధాన్యం రవాణాకు అవసరమైన లారీలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
