బైండోవర్ ఉల్లంఘనతో కఠిన చర్య..

బైండోవర్ ఉల్లంఘనతో కఠిన చర్య..

నేరస్తుడికి జైలు శిక్ష..

గుడివాడ, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లాలో తొలిసారిగా బైండోవర్ అమలులో ఉండగానే మరో కేసులో పాల్గొన్న వ్యక్తిని గుడివాడ వన్‌టౌన్ పోలీసులు జైలుకు తరలించారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఇది గుణపాఠమని డీఎస్పీ పి. శ్రీనివాస్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గుడివాడ ఉపవిభాగ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.

ఈ క్రమంలో బాంబే కాలనీకి చెందిన గొల్లపల్లి పోతురాజు (28) గతంలో పలుమార్లు నేరాల్లో పాల్గొన్న నేపథ్యంలో బిఎన్ఎస్‌ఎస్ చట్టంలోని 129(ఇ) సెక్షన్ ప్రకారం ఏడాది పాటు బైండోవర్ చేసి రూ.2 లక్షల భద్రతా పూచీకత్తు విధించారు.

అయితే పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా మరో కేసులో నిందితుడిగా మారడంతో బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. కార్యనిర్వాహక న్యాయాధికారి విచారణ అనంతరం పూచీకత్తు చెల్లించలేకపోవడంతో నిందితుడిని అమలాపురం జైలుకు తరలించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. గుడివాడ ఉపవిభాగ పరిధిలో ఇప్పటివరకు 444 మందిపై బైండోవర్ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బైండోవర్‌లో ఉన్నవారు మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని ఆయన స్పష్టం చేశారు.