చెత్త గుట్టపై ఫోకస్..

చెత్త గుట్టపై ఫోకస్..
గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పురపాలక సంఘం డంపింగ్ యార్డ్‌ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో కలిసి పరిశీలించారు. డంపింగ్ యార్డ్‌లో చెత్త ప్రాసెసింగ్, తొలగింపు పనుల పురోగతిని మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.
ఇప్పటివరకు 42 వేల టన్నుల చెత్తను ప్రాసెస్ చేసి తొలగించినట్లు అధికారులు తెలిపారు. అయితే చెత్త తొలగింపు పనులు మందకొడిగా సాగుతున్నాయంటూ ఎమ్మెల్యే రాము అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల బాధ్యతలు చేపట్టిన తరుణ్ అసోసియేట్స్ నిర్లక్ష్యం వల్ల విలువైన సమయం వృథా అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్షాకాలం ప్రారంభమైతే చెత్త తొలగింపు మరింత క్లిష్టమవుతుందని పేర్కొంటూ, పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోపు లక్ష్యాలను పూర్తి చేయాలని ఏజెన్సీ ప్రతినిధులకు స్పష్టం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే డంపింగ్ యార్డ్‌లో కొండలా చెత్త పేరుకుపోయిందని విమర్శించారు. రోజుకు 1200 టన్నుల చెత్తను ప్రాసెస్ చేసి తొలగించే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.
యార్డుకు ఆనుకుని ఉన్న పొలాలకు సమాంతరంగా డంపింగ్ యార్డ్ స్థాయిని తీసుకురావడానికి పూర్తిస్థాయిలో చెత్త తొలగిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 1.20 లక్షల టన్నుల చెత్తను తొలగించేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.
ఇప్పటికే 46 వేల టన్నుల చెత్త ప్రాసెసింగ్ పూర్తైందని, మరో 40 వేల టన్నుల చెత్త ప్రాసెసింగ్ దశలో ఉందన్నారు. వర్షాలు ప్రారంభమయ్యేలోపు వీలైనంత ఎక్కువ చెత్తను తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏజెన్సీ నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ, నందివాడ మండలాల టీడీపీ అధ్యక్షులు పండ్రాజు సాంబయ్య, దానేటి సన్యాసిరావు, మున్సిపల్ డీఈ సతీష్ చంద్ర, ఏఈ రాజేష్, పబ్లిక్ హెల్త్ డీఈ పాండురంగ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
