శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలి: ఎస్ఐ కృష్ణదేవ్

ఊర్కొండ, ఆంధ్రప్రభ ; అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలని ఊర్కొండ ఎస్ఐ కృష్ణదేవ్ సూచించారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన ఆధ్వర్యంలో మండలంలోని హిందూ, ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, పండుగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని మతాల, వర్గాల ప్రజలు పరస్పర సహకారం అందించాలని కోరారు.

సోషల్ మీడియాలో మతకలహాలు రెచ్చగొట్టే పుకార్లు, అసత్య ప్రచారాలను షేర్ చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు.

బక్రీద్ సందర్భంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పండుగను పరస్పర గౌరవ భావంతో, సోదరభావంతో జరుపుకోవాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారని తెలిపారు.

ఏదైనా అనుమానాస్పద ఘటనలు లేదా సమస్యలు తలెత్తిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. పోలీసులకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని హిందూ, ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.