నిధుల కోసం రాష్ట్రస్థాయి అధికారులకు వినతిపత్రం

నిధుల కోసం రాష్ట్రస్థాయి అధికారులకు వినతిపత్రం

  • సర్పంచ్ కుమ్ర భీమ్రావు

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని బాండేర్ గ్రామ పంచాయతీ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలను మంజూరు చేయాలని, అలాగే స్థానిక దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ బాండేర్ సర్పంచ్ కుమ్ర భీమ్రావు సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.

తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ను, అలాగే దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బాండేర్ పంచాయతీ పరిధిలో ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కూడా ఈ విషయాలపై పలుమార్లు వినతిపత్రాలు అందజేశానని, సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా కలిసి విన్నవించినట్లు సర్పంచ్ తెలిపారు.

ఈ విజ్ఞప్తులపై రాష్ట్రస్థాయి అధికారులు సానుకూలంగా స్పందించారని భీమ్రావు పేర్కొన్నారు. బాండేర్ గ్రామ పరిధిలోని గిరిజన విద్యార్థుల సౌకర్యార్థం ఆశ్రమ పాఠశాల ఏర్పాటుపై, దేవాలయాల నిధుల మంజూరుపై త్వరలోనే సంబంధిత కింది స్థాయి అధికారుల నుండి సమగ్ర నివేదికలు తెప్పించుకుని, సాధ్యమైనంత త్వరగా నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించినందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి, దేవాదాయ శాఖ కమిషనర్‌కు సర్పంచ్ కుమ్ర భీమ్రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply