పశ్చిమ గోదావరిలో ఇంచార్జి మంత్రి పర్యటన

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి , జిల్లా ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం సాయంత్రం 7 గంటలకు తాడేపల్లి నివాసం నుండి బయలుదేరి రాత్రి 9 గంటలకు తణుకు చేరుకొని ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో రాత్రి బస చేస్తారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు తణుకు నుండి బయలుదేరి 10 గంటలకు పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ సచివాలయం, వెల్‌నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
తదుపరి 10.35 గంటలకు గరువు గ్రామానికి చేరుకొని రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం 11 గంటలకు నవుడూరు సెంటర్ ప్రాంతానికి చేరుకొని నవుడూరు నుండి బ్రహ్మణ చెరువు వరకు నిర్మించిన రహదారిని ప్రారంభిస్తారు. 11.25 గంటలకు మార్టేరు గ్రామానికి చేరుకొని అచంట రోడ్డులోని ఎస్సీ, ఎస్టీ కాలనీలో ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు.
తర్వాత 11.50 గంటలకు పెనుగొండ మండలానికి చేరుకొని 132/33 కెవి సబ్‌స్టేషన్‌లో నూతన 50 ఎంవిఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.20 గంటలకు వడలి గ్రామానికి చేరుకొని సుబ్బారాయుడు పుంత వద్ద నిర్మించిన డబ్ల్యూబీఎం రహదారిని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్న భోజన విరామం కోసం కొమ్ముచిక్కల గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ నివాసానికి వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుండి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
