కర్నూలు జీజీహెచ్‌కు కార్పొరేట్ హంగులు….

కర్నూలు జీజీహెచ్‌కు కార్పొరేట్ హంగులు….

రూ.14.67 కోట్లతో 150 పడకల విశ్రాంతి సదన్‌కు భూమిపూజ.
రాష్ట్రంలో మూడో స్థానంలో ఉన్న ఆసుపత్రిని అగ్రస్థానానికి తీసుకెళ్తాం.
మంత్రి టీజీ భరత్ వెల్లడి.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమ ప్రజలకు ప్రధాన వైద్య కేంద్రంగా నిలిచిన కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని అత్యాధునిక సదుపాయాలతో రాష్ట్రంలోనే అగ్రగామి ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ స్పష్టం చేశారు. ఆసుపత్రికి వచ్చే పేద రోగుల సహాయకుల కోసం రూ.14.67 కోట్లతో నిర్మించనున్న 150 పడకల విశ్రాంతి సదన్ భవనానికి శనివారం భూమిపూజ నిర్వహించారు. కర్నూలు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ వంశీ రామమోహన్ బుర్రా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల ద్వారా ఈ భవన నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తోంది.

“కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తాం”

ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు జీజీహెచ్‌ను కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడో స్థానంలో ఉన్న ఆసుపత్రిని మొదటి స్థానానికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రోగుల వెంట వచ్చే కుటుంబ సభ్యులకు సరైన వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విశ్రాంతి సదన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అన్ని అనుమతులు పూర్తయ్యాయని, పది నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేయాలని నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

మూడు రాష్ట్రాల ప్రజలకు ఊరట

కర్నూలు జీజీహెచ్‌లో నిష్ణాతులైన వైద్యులు, మెరుగైన వైద్యసదుపాయాలు అందుబాటులో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది రోగులు చికిత్స కోసం వస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. విశ్రాంతి సదన్ నిర్మాణం పూర్తయితే రోగుల సహాయకులకు ఇది పెద్ద ఊరట కలిగిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో క్యాన్సర్ ఆసుపత్రి సేవలు విస్తరించాయని, ప్రస్తుతం సామర్థ్యానికి మించి రోగులకు సేవలు అందుతున్నాయని వివరించారు. భవిష్యత్తులో ఆసుపత్రికి మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు CSR సంస్థలు ముందుకు రావాలని కోరారు.

“కర్నూలుకు మా వంతు సహాయం కొనసాగుతుంది”

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సీఎండీ వంశీ రామమోహన్ బుర్రా మాట్లాడుతూ, తమ సంస్థ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ.100 కోట్ల CSR నిధులను వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించిందన్నారు. గతంలో కర్నూలు జీజీహెచ్‌కు సిటీ స్కాన్ యంత్రాల కోసం నిధులు అందించామని, ఇప్పుడు విశ్రాంతి సదన్ నిర్మాణానికి రూ.14.67 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.
తాను గతంలో జీ.పుల్లారెడ్డి విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థినని గుర్తుచేసుకుంటూ, కర్నూలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.

“ఏడు జిల్లాల ప్రజలకు ఉపయోగపడే భవనం”

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ రాయలసీమతో పాటు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల ప్రజలకు కూడా ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు. గతంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వారా సిటీ స్కాన్ సదుపాయాలు కల్పించారని, ఇప్పుడు మరోసారి సహకరించడం అభినందనీయమన్నారు.

“1956 నుంచి సేవలందిస్తున్న ఆసుపత్రికి కొత్త దశ”

జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1956లో ప్రారంభమైన ఈ ఆసుపత్రి రాయలసీమ ప్రజలకు కీలక వైద్యసేవలు అందిస్తోందన్నారు. ప్రతి రోజు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తున్నారని, వారికి వసతి సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో 60 సెంట్ల స్థలాన్ని కేటాయించగా, పవర్ గ్రిడ్ సంస్థ ఆధునిక హోటల్ తరహా భవన నిర్మాణానికి ముందుకు వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రి సేవల పరంగా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉందని, మంత్రి టీజీ భరత్ కృషితో త్వరలోనే మొదటి స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందన్నారు.

క్యాన్సర్ రోగులకు బ్యాటరీ వాహనం

కార్యక్రమంలో భాగంగా స్నేహశ్రీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.6.35 లక్షల విలువైన బ్యాటరీ ఆధారిత ప్రత్యేక స్ట్రక్చర్ వాహనాన్ని క్యాన్సర్ ఆసుపత్రి రోగుల సేవల కోసం ప్రారంభించి అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దోమన్ యాదవ్, చీఫ్ జీఎం సంజీవ్ కుమార్ సింగ్, CSR హెడ్ అఖిలేష్ పాఠక్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply