ప్రభుత్వ వైద్యసేవల్లో కర్నూలు జిల్లా మరో మైలురాయి…

ప్రభుత్వ వైద్యసేవల్లో కర్నూలు జిల్లా మరో మైలురాయి…
ప్రసవాలు, కంటి కాన్పులు, సాధారణ డెలివరీల్లో రాష్ట్ర స్థాయి గుర్తింపు.
ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు ఆసుపత్రుల వైద్య సిబ్బందికి ప్రశంసాపత్రాలు.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించడంలో కర్నూలు జిల్లా మరోసారి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రసవాలు, నవజాత శిశు సంరక్షణ, కంటి శుక్లాల ఆపరేషన్లు, క్లిష్ట సాధారణ కాన్పుల్లో విశేష ప్రతిభ కనబరిచిన ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సిబ్బందిని రాష్ట్ర సెకండరీ హెల్త్ డైరెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాష్ట్రంలోనే అత్యధిక ప్రసవాలు నిర్వహించడంతో పాటు, అత్యధిక సంఖ్యలో నవజాత శిశువులకు చికిత్స అందించిన ఆసుపత్రిగా ఆదోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి అగ్రస్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఎస్‌ఎన్‌సీయూ (SNCU) సిబ్బందికి రాష్ట్ర సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ప్రత్యేక ప్రశంసా పత్రాలను పంపించారు.
ఇక 2025 సంవత్సరంలో అత్యధికంగా 411 కంటి శుక్లాల ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించి రాష్ట్రస్థాయి రికార్డు సృష్టించిన ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రికు కూడా ప్రశంసలు దక్కాయి. ఆసుపత్రికి చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ చిరంజీవి సేవలను గుర్తిస్తూ రాష్ట్ర స్థాయి ప్రశంసా పత్రం అందజేశారు.
అదేవిధంగా కోడుమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో నాలుగు కిలోల బరువున్న శిశువుకు ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా అత్యంత నైపుణ్యంతో సాధారణ కాన్పు నిర్వహించినందుకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగరాజుతో పాటు వైద్య సిబ్బందిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
