మహానంది పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ..

ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడిన జిల్లా ఎస్పీ

బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఆదేశం.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుపై అధికారులకు సూచనలు

మహానంది, ఆంధ్రప్రభ: నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ శుక్రవారం మహానంది పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితులతో ఆయన స్వయంగా మాట్లాడి వారి సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

స్టేషన్‌లో పోలీసు సిబ్బంది ప్రవర్తన, ఫిర్యాదులపై స్పందిస్తున్న తీరు గురించి బాధితుల నుంచి నేరుగా వివరాలు సేకరించారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సూచించారు. అలాగే వివిధ కేసులకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో నిల్వ ఉంచిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యపై తక్షణమే స్పందించి చట్టపరిధిలో న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు జవాబుదారీతనంతో సేవలందిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని సూచించారు.

బాధితుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, వారికి త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్టేషన్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశించారు.

ఈ తనిఖీలో నంద్యాల సబ్‌డివిజన్ అదనపు ఎస్పీ ఎం. జావళి, తాలూకా రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.