విత్తన బంతులతో సామాజిక వనాల పెంపకం..

విత్తన బంతులతో సామాజిక వనాల పెంపకం..

సీసీఎఫ్ శ్రీనివాసరెడ్డి పిలుపు

గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా విత్తన బంతులను (సీడ్ బాల్స్) విస్తృతంగా ఉపయోగించి సామాజిక వనాలను పెద్ద ఎత్తున పెంచాలని తిరుపతి సర్కిల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరులోని అటవీశాఖ కార్యాలయంలో శనివారం తిరుపతి, గుంటూరు సర్కిళ్ల పరిధిలోని బాపట్ల, ప్రకాశం, గుంటూరు, రాయచోటి, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి జిల్లాల డీఎఫ్ఓలు, సోషల్ ఫారెస్ట్రీ అధికారులతో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది.

‘గ్రీన్ క్లైమేట్ టీమ్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం సమక్షంలో నిర్వహించిన ఈ సమావేశంలో సీసీఎఫ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2.5 కోట్ల విత్తన బంతులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా మన నేలకు అలవాటైన దేశీయ అడవి విత్తనాలతో పాటు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, పక్షులు గూళ్లు కట్టుకోవడానికి అనువైన వృక్ష జాతుల విత్తనాలను పెద్ద ఎత్తున సేకరించాలని అధికారులను ఆదేశించారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ సూచించిన అన్ని ప్రాంతాలలో సోమవారం ఉదయం నుంచే ఈ విత్తనాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ ప్రతినిధి జె.వి. రత్నం విత్తన బంతుల శాస్త్రీయ తయారీ విధానాన్ని వివరించారు. అరవై నుండి డెబ్బై శాతం దేశీయ ఆవు పేడను, ముప్పై నుండి నలభై శాతం మట్టితో కలిపి, ఉండలు చుట్టడానికి వీలుగా మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. విత్తనాల సైజును బట్టి 75 నుండి 150 గ్రాముల పరిమాణంలో ఈ మిశ్రమాన్ని తీసుకుని, ప్రతి బంతిలోనూ మూడు విత్తనాల చొప్పున పెట్టి వీటిని తయారు చేయాలని ప్రయోగాత్మకంగా వివరించారు. పర్యావరణ సమతుల్యతకు దోహదపడే ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎఫ్ఓ రవిశంకర్, ప్రకాశం జిల్లా డీఎఫ్ఓ వినోద్ కుమార్, గుంటూరు జిల్లా డీఎఫ్ఓ హిమశైలజతో పాటు పలువురు సోషల్ ఫారెస్ట్రీ అధికారులు పాల్గొని విజయవంతం చేశారు.