మహిళ సాధికారతే సమాజ పురోగతికి పునాది

మహిళ సాధికారతే సమాజ పురోగతికి పునాది
- వారి భద్రత సమాజం బాధ్యత
- సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
- రేణిగుంటలో మహిళల భద్రతపై అవగాహన
- మహిళలు భయపడకుండా ఫిర్యాదు చేయాలని సూచన
- నేరాలకు పాల్పడితన కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ: మహిళ సాధికారతే సమాజ పురోగతికి నిజమైన పునాది అని ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు. రేణిగుంట సబ్ డివిజన్ పోలీసులు మహిళల భద్రత, మహిళ సాధికారత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై గాజులమండ్యం ఆర్‌పీఆర్ కన్వెన్షన్ హాల్‌లో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళ సాధికారత అనేది కేవలం నినాదం కాదని, సమాజ నిర్మాణానికి అత్యంత కీలకమైన శక్తి అని తెలిపారు. మహిళలు విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, ఆత్మవిశ్వాసంతో ముందుకు వస్తే కుటుంబాలతో పాటు సమాజం కూడా అభివృద్ధి దిశగా పయనిస్తుందని పేర్కొన్నారు.
అవగాహన అవసరం
మహిళలు తమ హక్కులు, చట్టపరమైన రక్షణలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి వేధింపులు జరిగినా భయపడకుండా ముందుకు వచ్చి పోలీసులను సంప్రదించాలని సూచించారు. గృహ హింస, సైబర్ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి మహిళ ఆత్మగౌరవంతో, భద్రతతో జీవించే వాతావరణం కల్పించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారులపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటి తప్పుకే రౌడీషీట్ నమోదు చేసి, పునరావృతమైతే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి
చిన్నారుల రక్షణ కోసం స్కూళ్లు, కాలేజీలు, మహిళా సంఘాలతో కలిసి నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, డ్రగ్స్ వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా యువత సెల్‌ఫోన్ వినియోగాన్ని నియంత్రణలో ఉంచి విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, ప్రజలు ‘శక్తి’ యాప్, డయల్-112, మహిళా హెల్ప్‌లైన్-181, సైబర్ హెల్ప్‌లైన్-1930, చైల్డ్‌లైన్-1098 సేవలను వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు.
బాధ్యతతో వ్యవహరించాలి
సమాజంలో జరిగే తప్పులను చూసి మౌనంగా ఉండకుండా ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించి పోలీసులకు సమాచారం అందిస్తేనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఎస్పీ పిలుపునిచ్చారు. మహిళల భద్రత, యువత భవిష్యత్తు, సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత, ఎస్‌బీ డీఎస్పీ గీతా కుమారి, సీఐలు మంజునాథ్ రెడ్డి, జయచంద్ర, శ్రీకాంత్ రెడ్డి, ఎండీవో రవిచంద్ర, వైద్యాధికారి చక్రపాణి, సీడీపీవో కృష్ణవేణి, మహిళా సంఘాల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
