డబ్బులు పంచడం కాదు.. సంపద పెంచే ప్రభుత్వం

డబ్బులు పంచడం కాదు.. సంపద పెంచే ప్రభుత్వం
- భవిష్యత్తులో ఉపాధి విప్లవం
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఆంధ్రప్రభ బ్యూరో, ఆమదాలవలస:
డబ్బులు పంచే ఆలోచనతో కాకుండా.. సంపద పెంచే ఆలోచనతో కూటమి సర్కారు ముందుకు వెళ్తున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం ఆముదాలవలస నియోజకవర్గం పరిధిలో స్థానిక ఎమ్మెల్యే, పియూసి చైర్మన్ కూన రవికుమార్ తో కలసి ఆయన పర్యటించారు. తొలుత వంజగి దగ్గర శ్రీ వెంకటేశ్వర ఆలయంలో 15వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, యజ్ఞ పూర్ణాహుతి కారక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుండి ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి జగ్గుశాస్.. లపేట వద్ద 3.82 కోట్లతో నిర్మిస్తున్న 33/11 కెవి సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం బూర్జ మండలం మదనాపురం కూడలి నుండి అల్లెన వరకు ఆరుకోట్ల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన బిటి రోడ్డును ప్రారంభించారు. ఈ సంధర్భంగా అల్లెన వరకు రోడ్ షో నిర్వహించి.. అక్కడ జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా కాదని.. అవకాశాల జిల్లా అంటూ తెలిపారు . ప్రజల తోడ్పాటు ఉంటే వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని తెలిపారు. నూతన ప్రాజెక్టులు జిల్లాకు తీసుకురావాలని ప్రయత్నిస్తే పోరాటాలతో కొందరు వాటిని అడ్డుకోవడం బాధాకరమని అన్నారు.
అభివృద్ధిపై అవగాహన ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి కూన రవికుమార్ ఆముదాలవలస ఎమ్మెల్యే గా ఉన్న నేపథ్యంలో.. తామిద్దరం ఆమదాలవలసను అందాల వలసగా మార్చేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే బూర్జ మండలం అల్లెన గ్రామ ప్రజల దశాబ్దాల కల.. మూడున్నర కిలోమీటర్ల రోడ్డు నిర్మించుకున్నామని, తద్వారా 20 కిలోమీటర్ల ప్రయాణ భారం తగ్గిందని తెలిపారు. కనెక్టివిటీ పేరుగడంతో అభివృద్ధితో పాటు గతంలో 10 లక్షలు ఉన్న భూములు నేడు 50 లక్షలకు చేరాయని అన్నారు. బూర్జ మండలాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో 400కిలోమీటర్ల రోడ్లను వేశామని స్పష్టం చేశారు. అల్లెన గ్రామంలో ఎంపీ లాడ్స్ నిధుల నుండి కమ్యూనిటీ భవనం, విద్యుత్ లైన్లు, మదనాపురం కూడలిలో బస్ షెల్టర్ ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సహకారంతో రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి వైపు బలమైన అడుగులు వేస్తున్నాయని స్పష్టం చేశారు. గతంలో నేతలు ముద్దులు పెట్టి ఆకాశంలో చుక్కలు చూపించారని.. వాయిదాల పద్ధతిలో సంక్షేమాన్ని అందించారని ఆరోపించారు. కూటమి పై నమ్మకంతో పెద్ద మెజారీతో బాధ్యతను అప్పజెప్పిన రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గొప్ప పరిపాలనను చేరువ చేస్తున్నామని అన్నారు. సూపర్ సిక్స్ అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో అందిస్తున్నామని అన్నారు. పెరిగిన ఫించన్లు, ఉచిత గ్యాస్, ఫ్రీ బస్, తల్లికి వందనం పథకాలను లబ్ధిదారులకు చేరువ చేశామని తెలిపారు. లక్షల కోట్ల పెట్టుబడుల రాకతో భవిష్యత్ లో ఉపాధి విప్లవాన్ని సృష్టిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మాజీ శాసన మండలి సభ్యులు పీరుకట్ల విశ్వప్రసాద్, ఇన్ చార్జ్ ఆర్డీఓ వేణుగోపాల్, ఎపిఈపిడిసిఎల్ ఎస్ఈ కృష్ణమూర్తి, ఈఈ యోగీశ్వరరావు, కన్స్ట్రక్షన్ ఈఈ పి. ఆనంద్, ఎడిలు బి. రవి కుమార్, పి. నారాయణరావు, జగదీష్, ఎ. ఈ. శ్రీనివాస సాహు, ఆముదాలవలస జనసేన ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్, కూటమి నేతలు, శ్రేణులు పాల్గొన్నారు.
