Delhi | 30 రోజులు జైలులో ఉంటే పదవి రద్దు..?

Delhi | 30 రోజులు జైలులో ఉంటే పదవి రద్దు..?
130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ
న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ : క్రిమినల్ కేసుల్లో అరెస్టై వరుసగా 30 రోజులు జైలులో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, కేంద్ర–రాష్ట్ర మంత్రులు పదవులు కోల్పోయేలా ప్రతిపాదించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు-2025పై కేంద్ర ప్రభుత్వం కీలకంగా ముందుకెళ్తోంది. ఈ బిల్లుకు సంబంధించిన అంశాలపై గురువారం ఢిల్లీలో నిర్వహించిన కీలక సమావేశంలో పలు రాష్ట్రాల ప్రతినిధులు, న్యాయ నిపుణులు, విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను కమిటీ ముందు వెల్లడించారు. తెలంగాణ తరఫున సీఎస్ రామకృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను వివరించినట్లు సమాచారం.ఈ బిల్లులోని ప్రధాన ప్రతిపాదన ప్రకారం, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న కేసులో అరెస్టై వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రి లేదా మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. 31వ రోజుకల్లా రాజీనామా చేయకపోతే పదవి స్వయంచాలకంగా రద్దయ్యేలా నిబంధనలు ప్రతిపాదించబడ్డాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం కోర్టు శిక్ష ఖరారైన తర్వాతే ప్రజాప్రతినిధుల అర్హతపై ప్రభావం పడుతుండగా, ఈ బిల్లు మాత్రం అరెస్టు, నిర్బంధం ఆధారంగానే చర్యలు తీసుకునేలా ఉండటం వల్ల విస్తృత చర్చకు దారితీస్తోంది.
మార్పులు అవసరమని
ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజకీయాల్లో నేరచరిత్రకు అడ్డుకట్ట, పాలనలో నైతిక విలువలు పెంపు, ప్రజా విశ్వాసాన్ని కాపాడే చర్యగా సమర్థిస్తోంది. అయితే ప్రతిపక్ష పార్టీలు, కొంతమంది రాజ్యాంగ నిపుణులు మాత్రం “తప్పుడు కేసులు పెట్టి రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసే అవకాశం ఉంది”, “కోర్టు తీర్పు రాకముందే శిక్ష విధించినట్టవుతుంది” అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లును ఇప్పటికే పార్లమెంట్ సంయుక్త కమిటీ పరిశీలనకు పంపినట్లు సమాచారం. ఇక తాజా ఢిల్లీ సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించగా, తెలంగాణ ప్రభుత్వం కొన్ని సెక్షన్ల కింద నమోదయ్యే కేసులు, 30రోజుల జైలు నిబంధనల విషయంలో మార్పులు అవసరమని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అమలైతే భారత రాజకీయ వ్యవస్థలో పెద్ద మార్పులకు దారితీయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
