30thMayeditorial | ప్రశ్నపత్రాల భద్రతకు ఎయిర్ ఫోర్స్ సాయం ప్రతిపాదన

30thMayeditorial | ప్రశ్నపత్రాల భద్రతకు ఎయిర్ ఫోర్స్ సాయం ప్రతిపాదన
30thMayeditorial | నీట్ రద్దుతో లక్షలాది విద్యార్థుల్లో ఆందోళన
ఎన్టీఏ వైఫల్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ప్రశ్నలు
ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో నీట్ రీటెస్ట్
30thMayeditorial | దేశవ్యాప్తంగా మే 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షల్లో ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేసి, జూన్ 21వ తేదీన తిరిగి పరీక్ష నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించింది. ఆ సంస్థ అసమర్థత వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు మళ్లీ ఆ పరీక్షకు సిద్ధం కావలసిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ, జవాబుదారీతనం లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని పేర్కొంది.
భారీ ఎత్తున దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించేందుకు తగిన యంత్రాంగాన్ని కలిగి ఉన్నప్పటికీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎందుకు విఫలమవుతోంది అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పర్యవేక్షణ యంత్రాంగం, సంబంధిత కమిటీలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఉల్లంఘన ఎలా జరుగుతోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పేపర్ లీక్‌పై అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. లక్షలాది రూపాయలను కోచింగ్ సెంటర్లకు ఖర్చు చేసిన ఆ అభ్యర్థుల తల్లిదండ్రుల ఆందోళన, మానసిక వ్యధ చెప్పనలవి కాదు. ఇదేదో చిన్న విషయం కాదని, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినది అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.
ఏప్రిల్ 17వ తేదీన నిర్వహించిన ఒక ఉన్నతస్థాయి సమావేశం గురించి కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఎన్టీఏ ప్రస్తావించింది. ఆ సమావేశంలో చేసిన సిఫార్సులను ఇప్పటికే అమలులో పెట్టినట్టు పేర్కొంది. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వివిధ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసినట్టు ఎన్టీఏ పేర్కొంది. ఇంత కసరత్తు చేసినా పేపర్ లీక్ ఎలా అయింది అని కోర్టు ప్రశ్నించింది. దీనంతటికీ జవాబుదారీతనం లేకపోవడమే కారణం అని స్పష్టం చేసింది.
పేపర్ అంతా లీక్ కాలేదని, ఏవో కొన్ని ప్రశ్నలు మాత్రమే లీక్ అయ్యాయన్న వివరణ వచ్చింది. పరీక్ష రద్దుకు ఇవే కాకుండా అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. నీట్ రీటెస్ట్‌ను ప్రధానమంత్రి కార్యాలయం స్వయంగా పర్యవేక్షిస్తోంది. ఈ రీటెస్ట్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ప్రధానమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తోంది. ప్రశ్నపత్రాల ముద్రణాలయాల నుంచి వాటిని పరీక్షా కేంద్రాలకు సురక్షితంగా తరలించేందుకు ఎయిర్ ఫోర్స్‌ను మోహరించడానికి ఒక ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం ఈ ప్రశ్నపత్రాలను పోస్టల్ నెట్‌వర్క్ ద్వారా పంపుతున్నారు. ఇందులో లీక్ అయ్యే అవకాశాలున్నాయన్న ఉద్దేశంతో ఎయిర్ ఫోర్స్ సాయాన్ని తీసుకోవాలని యోచిస్తున్నారు.
కాగా, సుప్రీంకోర్టు నీట్ నిర్వహణను చూస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఏజెన్సీ రిట్ పిటిషన్ల కాపీలను సొలిసిటర్ జనరల్‌కు అందజేయాలని ఆదేశించింది. ఈ పిటిషనర్ల తరఫున హాజరైన లాయర్ తన్వీ దూబే ఈ కేసు ప్రాధాన్యతను వివరించారు. అయితే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గతంలో జరిగిన పొరపాట్లను దిద్దుకోవడానికి తగిన చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. గతంలో జరిగిన తప్పులే ఈసారి కూడా జరిగాయని పేర్కొంది.
